జనగామ చౌరస్తా, నవంబర్ 27 : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని జనగామ డీఈవో కే రాము అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో రాము, విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో రాము మాట్లాడుతూ సత్యాన్వేషణలో పోటీ తత్తాన్ని కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు సునిశిత పరిశీలన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులకు రాత పరీక్ష, క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభచూపిన వారికి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లాలోని చిల్పూరు మండలం మల్కాపురం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎం మహేశ్, కే విల్సన్, పీ రంజిత్ ఎంపిక కాగా, ఇంగ్లిష్ మీడియం విభాగంలో టీఎస్ మోడల్ స్కూల్ నర్మెటకు చెందిన విద్యార్థులు ఎం మన్విత, జీ వరుణ్, ఏ సాయి వంశీ, ప్రైవేట్ ఇంగ్లిశ్ మీడియం విభాగంలో సెయింట్ ఆన్స్ మరియపురం విద్యార్థులు హాసిని, ఎం సత్యవతి, రజనీకాంత్ ఎంపికయ్యారు. సిరిసిల్లా జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీల్లో ఈ విద్యార్థుల బృందం జిల్లా నుంచి పాల్గొంటున్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రవీందర్, జిల్లా సైన్స్ అధికారి గౌసియాబేగం, రసాల బాలరాజు, ఎండీ ఖాసిం, శోభన్‌రెడ్డి, లక్ష్మణ్, జీటీ శ్రీనివాస్, ఉమాదేవి, శోభన్‌బాబు, చంద్రశేఖర్‌రావు, కృష్ణ, శ్రీనివాస్, శ్రీహరి, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.