దేవరుప్పుల, జూన్ 7 : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏటా ఎంపిక చేసిన రంగుల్లో రెండు జతల ఏకరూప దుస్తులను ఉచితంగా అందిస్తోంది. వీటి ప్రతి సంవత్సరం ప్రైవేటు వ్యక్తులతో కుట్టించేవారు. వచ్చే విద్యాసంవత్సరానికి గాను స్కూల్ యూనిఫాం కుట్టే పనులను జనగామ జిల్లా విద్యాశాఖ ఐకేపీ మహిళా సంఘాలకు అప్పగించింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 44,748 మంది ఉండగా వీరందరికీ విద్యాసంవత్సర ఆరంభం నాటికి కొత్త దుస్తులు ఉండేలా కార్యాచరణ చేపట్టింది. ఈమేరకు మండలాల్లో ఉన్న మహిళా సంఘాలతో కుట్టించేందుకు ఇప్పటికే సెర్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అనుభవజ్ఞులకు అవకాశం..
మల్కాపూర్‌లో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న వరలక్ష్మి టెక్స్టైల్ యూనిట్, బచ్చన్నపేట మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మరో టైక్స్‌టైల్ యూనిట్ ఇప్పటికే తెలంగాణలో అన్ని మండలాల్లో పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న పశుమిత్రలకు యూనిఫాంలు కుట్టించిన అనుభవం ఉంది. మరోవైపు జిల్లాలో పలు మండలాల్లో టైలరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిటల్లలో ఒక్కసారే వంద దుస్తులు కట్ చేసే మిషన్లు ఉన్నాయి. ఒక్క రోజులో 800దుస్తులకు కాజాలు, గుండీలు వేయగల సామర్థ్యమున్న మిషన్లు ఉన్నాయి. వీరంతా కలిసికట్టుగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి అందిస్తారనే నమ్మకంతో సెర్ప్, విద్యాశాఖ నుంచి దుస్తుల ఆర్డర్ తీసుకుంది.
టైలరింగ్ చేసే మహిళలతో సమావేశం
విద్యాశాఖ నుంచి ఏకరూప దుస్తుల ఆర్డర్ రావడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళలు నిర్వహిస్తున్న టెక్స్‌టైల్స్‌తో పాటు అన్ని మండలాల్లో సుశిక్షతులైన ఎంపిక చేసిన మహిళలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని మండలాల నుంచి మహిళలు రాగా 130మంది తాము దుస్తులు కుడతామని తమ అంగీకారం తెలిపారు. మహిళలు ఆసక్తిగా ఉండడంతో యూనిఫారాలకు విద్యాసంవత్సరం ఆరంభం నాటికి కుట్టి అందించేలా అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. వీరందరికీ దుస్తులు కుట్టే విధానాన్ని తెలిపి, అందివ్వాల్సిన సమయం, కొలతలను వివరించారు.
మండలాల వారీగా విద్యార్థుల వివరాలు
జిల్లాలోని ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలు, అర్బన్ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, టీఆర్ఈఐఎస్, టీడబ్ల్యూ ప్రైమరీ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూల్స్ కలిపి 44,748 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 21,916 మంది బాలురు, 22,832 మంది బాలికలు ఉన్నట్టు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో బచ్చన్నపేట మండలంలోని అన్ని పాఠశాలల్లో కలిపి 4101 మంది ఉండగా బాలురు 1987, బాలికలు 2114 ఉన్నారు. చిల్పూరులో 3495 మందికి గాను 1829 మంది బాలురు, 1666 బాలికలు, దేవరుప్పుల మండలంలో 2994 మందిలో 1447 మంది బాలురు, 1547 మంది బాలికలు ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 4506 మంది ఉండగా 2189మంది బాలురు, 2317 మంది బాలికలున్నారు. జనగామ మండలంలో అన్ని పాఠశాలల్లో కలిపి 6623 మంది ఉండగా 3254 మంది బాలురు, 3369 మంది బాలికలు, కొడకండ్లలో 3499 మంది ఉండగా 1445 మంది బాలురు, 2054 మంది బాలికలున్నారు. ఇక లింగాలఘనపురంలో 3258 మంది ఉండగా 1573మంది బాలురు, 1685 మంది బాలికలు ఉన్నారు. నర్మెట్ట మండలంలో 2545 మంది ఉండగా 1303 మంది బాలురు, 1242 మంది బాలికలున్నారు. పాలకుర్తి మండలంలో 4107 మంది ఉండగా 2102 మంది బాలురు, 2005 మంది బాలికలు, రఘునాథపల్లి మండలంలో 4261 మంది ఉండగా 2132 మంది బాలురు, 2129 మంది బాలికలున్నారు. తరిగొప్పుల మండలంలో 1587 మంది ఉండగా 739 మంది బాలురు, 848 మంది బాలికలు ఉన్నారు. జఫర్‌గఢ్ మండలంలో 3772 సంఘాలకు ఆర్డర్ ఇచ్చాం..
మంది ఉండగా 1916 మంది బాలురు, 1858 మంది బాలికలున్నారు.
విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వయంసహాయక మహిళా గ్రూపులు కుట్టేందుకు విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థతో ఒప్పందం జరిగింది. ప్రభుత్వం నుంచి క్లాత్ మెటీరియల్ నేరుగా ఆయా మండలాల్లో ఉన్న విద్యావనరుల కేంద్రానికి ఇప్పటికే చేరింది. వాటిని ఎంపిక చేసిన మహిళాలకు సెర్ప్ ద్వారా అందిస్తారు. ప్రతి సంవత్సరం ప్రైవేట్ వ్యక్తులతో విద్యాశాఖ కుట్టించేది. ఈసారి సెర్ప్ సహకారంతో ఎంపిక చేసిన గ్రూపులతో విద్యాశాఖ కుట్టిస్తుంది.
ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి
– రాజేంద్రప్రసాద్, డీపీఎం నాన్‌ఫాం, సెర్ప్, జనగామ జిల్లా
పెద్ద ఎత్తున విద్యాశాఖ నుంచి దుస్తులు కుట్టే ఆర్డర్ రావడంతో మహిళా గ్రూపుల్లో ఉన్న టైలరింగ్ చేసే వారికి మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అనేక ప్రణాళికలు అమలుచేస్తున్నారు. అందులో భాగంగా ఏటా వేలాది మంది విద్యార్థుల దుస్తులు కుట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థికంగా ఎదుగుతారు. ఇప్పటికే చాలామందికి రెడీమేడ్ దుస్తులు కుట్టి మార్కెటింగ్ చేస్తున్న అనుభవం ఉంది. మండల విద్యా వనరుల కేంద్రానికి క్లాత్ చేరింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం.