నర్మెట, మార్చి 10 : సముద్రం తలాపున పెట్టుకొని చేప దూపకేడ్చినట్లుగా ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. మండలం చుట్టూ రిజర్వాయర్లు ఉన్నా సాగునీరు లేక ఆందోళన చెందుతున్నారు. కండ్లముందే పంటలు ఎండిపోతుంటే(Crops drying) అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. మండలంలో మల్లన్నగండి, బొమ్మకూర్, వెల్దండ, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో నడి ఎండకాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సాగు నీరు అందించేందుకు చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపారు. రైతులకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగు నీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.
గ్రామాల్లో ఎక్కడా రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు ఇప్పటివరకు అందించలేదు. కొద్దిమందికి మాత్రమే రైతుబంధును విడుదల చేసి అందరికి అందించినట్లు కాకి లెక్కలు చెబుతుంది. తలపున నీరు ఉన్నా మాకేందుకు నీళ్లు విడుదల చేస్తలేరని మండల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని బొమ్మకూర్ గ్రామ పరిధిలో రిజర్వాయర్ ఉన్నా కూడా పంటలు ఎండిపోతున్నాయి. బోడబండతండాకు చెందిన అంగోత్ వీరమ్మ కొడుకు సంజీవ నాలుగు ఎకరాల్లో నాటు వేశారు. మా పక్కనే బొమ్మకూర్ రిజర్వాయర్ ఉన్నా కూడా సుక్క నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా పంటలకు నీళ్లు ఇచ్చి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.