జనగామ చౌరస్తా, జూన్ 29: తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువతికి అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆమె కడుపులో ఉన్న 9 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నది. చికిత్స నిమిత్తం జనగామలోని ఓ ప్రముఖ దవాఖానకు వచ్చారు. హాస్పిటల్లో ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సీహెచ్ రాజమౌళి ఆధ్వర్యంలో యువతికి అరుదైన ఆపరేషన్ నిర్వహించి.. కడుపులో ఉన్న 9 కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అరుదైన ఆపరేషన్ నిర్వహించి యువతికి మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించిన డాక్టర్ రాజమౌళిని యువతి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు అభినందించారు. ఈ ఆపరేషన్లో అనస్థీషియా, రేడియాలజిస్ట్తో పాటు థియేటర్ సిబ్బంది అలిసేరి శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్, రమేష్ పాల్గొన్నారు.