ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పక్కనే ఉన్న పాఠశాలలు, కళాశాలల్లోకి చేరుతున్న దుమ్ము
వ్యాధులకు గురవుతున్న విద్యార్థులు
పట్టించుకోని అధికారులు
ఏటూరునాగారం, డిసెంబర్ 20 : మండల కేంద్రం సమీపంలో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయాయి. మూడు నెలల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో ఉన్న సింగిల్ రోడ్డు బీటీని తొలగించారు. ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వరకు రూ.37 కోట్లతో 2017లో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులను మంజూరు చేసింది. సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ రోడ్డు అటవీశాఖ పరిధిలోకి వస్తున్నట్లు భావించిన ఆ శాఖ అధికారులు పలు చోట్ల పనులను నిలిపివేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఏటూరునాగారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపున ఉన్న సింగిల్ రోడ్డుపై బీటీ తొలగించారు. రోడ్డునువెడల్పు చేసి కంకర వేశారు. దీనిపై బీటీ పనులు చేపట్టకుండా అటవీశాఖ అధికారులు నిలిపివేశారు. ఈ దారి వెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల, గిరిజన బాలికల కళాశాల, గిరిజన క్రీడా పాఠశాలలు ఉన్నాయి. ఈ రోడ్డు వెంట వాహనాలు వెళుతున్న క్రమంలో లేస్తున్న దుమ్ము తరగతి గదులు, డార్మేటరీ, డైనింగ్ హాలులోకి వస్తున్నదని విద్యార్థులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా కంకర ఉన్న రోడ్డుపై విద్యార్థులు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వెంట నడిచి వెళ్తున్న క్రమంలో వాహనాలు వచ్చినపుడు లేచే దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ముతో విద్యార్థులు, దగ్గు, ఆయసం, అస్తమా బారిన పడుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉన్న రోడ్డును విస్తరణ చేస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. రోడ్డు పనులు ఆగిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ ప్రాంతంలో పనులకు అనుమతి లేదు
అటవీ ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు అనుమతి లేదు. అందుకే పనులు ఆగిపోయాయి. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. అనుమతి వస్తే పనులు చేసుకునే అవకాశం ఉంది. – ఎఫ్ఆర్వో లక్ష్మీనారాయణ