ఎక్సైజ్ కాలనీలో ఘనంగా నవీన్ పుట్టిన రోజు వేడుకలు
మూర్తిమత్వం గ్రంథం, స్నేహరాగం నవల ఆవిష్కరణ
సుబేదారి, డిసెంబర్ 24: సాహిత్యాన్ని, సమాజాన్ని తన రచనలతో నిరంతరం అధ్యయనం చేస్తున్న డాక్టర్ అంపశయ్య నవీన్ సమాజ వారసత్వ సంపద అని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య ప్రశంసించారు. నవీన్ 80వ పుట్టిన రోజు వేడుకలు హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా బన్న ఐలయ్య, ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ రచించిన మూర్తిమత్వం గ్రంథాన్ని ఐలయ్య, స్నేహరాగం నవల పుస్తకాన్ని రమాదేవి ఆవిష్కరించారు. అనంతరం బన్న ఐలయ్య మాట్లాడుతూ అంపశయ్య నవీన్ 34 నవలలు, 8 గ్రంథ సంపుటిలు, ఒక యాత్రి నవల, ఒక ఫీచర్ నవల, సినిమా సమీక్షలు, 5 విమర్శ గ్రంథాలు రచించారని తెలిపారు. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ప్రామాణిక జీవన రచయితగా అంపశయ్య పేరు పొందారని అన్నారు. నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ నవీన్ స్నేహరాగం నవలలో కుల, మత, వర్గ, వర్ణ భేదం లేకుండా స్నేహ బంధాన్ని సరికొత్త ధోరణితో సృజింపజేశారని అన్నారు. ఈ నవలలో మానవతకు పట్టం కట్టారని వివరించారు. సాహితీవేత్తగా వరంగల్ కీర్తి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశారని చెప్పారు. ముందుగా నవీన్ నివాసంలో గ్రంథాలయాన్ని రచయిత ఎల్ఎస్ఆర్ ప్రసాద్ ప్రారంభించారు. రచయితలు, బంధువులు అంపశయ్య నవీన్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంపశయ్య లిటరరీ సంస్థ కార్యదర్శి డీ స్వప్న, రచయితలు వీఆర్ విద్యార్థి, అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, నల్లెల్లె రాజయ్య, వాసిరెడ్డి కృష్ణారావు, మంథని శంకర్, కర్నె సదాశివ్, పలువురు రచయితలు పాల్గొన్నారు.