అవకతవకలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయలి
ట్రైకార్ జీఎం శంకర్రావు
ఏటూరునాగారం, ఆగస్టు 23: ఎకనామికల్ సపోర్టు స్కీం (ఈఎస్ఎస్) కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా వందశాతం రుణాలు మంజూరు చేయాలని ట్రైకార్ జనరల్ మేనేజర్ కుంజ శంకర్రావు ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఈ పథకం అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఏటూరునాగారం ఐటీడీఏకు ప్రభుత్వం కేటాయించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో.101 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సూచించారు. అవకతవకలకు చోటు లేకుండా లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న ఎంపిక విధానాన్ని స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు వేసి ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించే విధంగా ఎంపీడీవోలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లోని టీఎస్పీ మండలాల్లో మంజూరు పూర్తి చేయాలని సూచించారు.
మంజూరు చేసే క్రమంలో ప్రతీ రోజు వివరాలను ట్రైకార్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. ఒకే స్కీం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, అవసరమైతే డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలని సూచించారు. బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి లబ్ధిదారుల ఖాతా నంబర్లతో వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ట్రైకార్లో డీజీఎంగా పనిచేస్తున్న శంకర్రావుకు ప్రభుత్వం ఇటీవల జనరల్ మేనేజర్‌గా ఉద్యోగోన్నతి కల్పించడంతో వివిధ శాఖల ఉద్యోగులు ఆయనను సన్మానించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ మంకిడి ఎర్రయ్య, ఐటీడీఏ ఏవో దామోదర్‌స్వామి, పీఏవో లక్ష్మీ ప్రసన్న, ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ, మేనేజర్ లాల్ నాయక్, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్, జీసీడీవో పద్మావతి, ఏసీఎంవో సారయ్య, ఐటీడీఏ ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు, పెనక ప్రభాకర్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.