ఉద్యమమే ఊపిరి, సాహిత్యమే అతడి ఆస్తి
స్వగ్రామం చిన్నగూడూరుపై ‘జీవనయానం’లో వర్ణన
బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ పోరాటయోధుడిగా ఖ్యాతి
రేపు రంగాచార్యుల జయంతి
చిన్నగూడూరు, ఆగస్టు 22 :ఉద్యమమే ఊపిరిగా, సాహిత్యమే ఆస్తిగా భావించాడు. నిజాం పాలనలో అరాచకాలు, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు పన్నెండేళ్లకే ఉద్యమబాట పట్టాడు. తన స్వగ్రామం చిన్నగూడూరు గురించి ‘చిన్ననాటి చందమామ.. నా అందాల రాశి’ అంటూ వర్ణిస్తూ.. ఆకేరు, తుమ్మల, ముత్యాలమ్మ చెరువులు, పంటలతో ఊరి చుట్టూ పరుచుకున్న ప్రకృతి రమణీయతను తన ‘జీవనయానం’లో ఆవిష్కృతం చేశాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలంగాణ పోరాట యోధుడిగా ఖ్యాతి గడించాడు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరుకు చెందిన దాశరథి రంగాచార్యులు. రేపు ఆ మహనీయుడి జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.
‘చిన్ననాటి చందమామ.. నా అందాల రాసి.. నా స్వగ్రామం చిన్నగూడూరు.. గ్రామానికి వన్నె తెచ్చే ఆకేరు, తుమ్మల చెరువు, ముత్యాలమ్మ చెరువులు.. రెండు పంటలతో అలరారే గ్రామం చిన్నగూడూరు.. అని గ్రామం చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను రంగాచార్యులు ‘జీవనయానం’లో అప్పటి స్థితిగతులను తన జ్ఞాపకాలుగా ఆవిష్కృతం చేశారు. సాహితీవేత్తగా, తెలంగాణ పోరాట యోధుడు, బహుముఖ ప్ర జ్ఞాశాలిగా దాశరథి పేరుతెచ్చుకున్నారు. ఆయన స్వగ్రా మం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు. వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు 24 ఆగస్టు, 1928లో జన్మించారు. మంగళవారం ఆయన జయంతిని ఘనంగా నిర్వహించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జయంతిని అధికారికంగా నిర్వహించాలి..
ఉద్యమమే ఊపిరిగా, సాహిత్యమే తన ఆస్తిగా భావించి దొరలు, భూస్వాములు దౌర్జన్యాలను ఎదిరించి వెట్టిచాకిరీ నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు అవిశ్రాంత పోరాటం సల్పిన ధీశాలి దాశరథి. తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఉద్యమ కెరటం ఆయన. అందుకే ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు, గ్రామస్తులు కోరుతున్నారు. రంగాచార్యులు, కృష్ణమాచార్యుల విగ్రహాలను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసి ఇద్దరికీ సముచిత స్థానం కల్పించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
12 ఏండ్లకే ఉద్యమబాట..
బాల్యం నుంచే ఉద్యమభావజాలం కలిగిన రంగాచార్యులు నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న అరాచకాలు, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ఉద్యమబాట పట్టారు. ఇలా 12 ఏండ్లకే ప్రజాపోరాటాలకు అంకితమయ్యారు. తన రచనలతో ప్రజలను జాగృతం చేస్తూ 1946నుంచి 1951వరకు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. చిన్నగూడూరు నాటి గార్ల సంస్థానంలో ఉండేది. రంగాచార్యులు తన అన్న కృష్ణమాచార్యులుతో కలిసి సుమారు దశబ్దమున్నర పాటు గార్లలో జీవించారు. అతడి ఉద్యమపోకడలను గుర్తించిన నిజాం పాలకులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో బంధించారు. చెరసాల నుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. మోదుగుపూలు, చిల్లరదేవుళ్లు, వేదాల అనువాదం, జీవనయానం, జనపదం.. ఇలా పలు అద్భుతమైన రచనలు చేసి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.