జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సహాల మధ్య పండుగ
సోదరులకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు
కానుకలిచ్చి దీవెనలు పొందిన అన్నదమ్ములు
జనగామ, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రక్షాబంధన్ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఆడపడుచులు పుట్టింటికి చేరుకొని అన్న, తమ్ముళ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. సోదరులు తమ తోబుట్టువులకు కట్నకానుకలు ఇచ్చి దీవెనలు పొందారు. కొన్నిచోట్ల సోదరీమణులు అన్నదమ్ములకు మాస్కులు, శానిటైజర్లు, హెల్మెట్లు రిటర్న్ గిఫ్ట్‌గా అందజేశారు.
గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా చాలా మంది ఫోన్, వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా సోదరులకు శుభాకాంక్షలు తెలిపి సరిపెట్టుకోగా, ఈసారి బస్సులు, రైళ్లు నడువడం, కరోనా ప్రభావం తక్కువగా ఉండడంతో ప్రజలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచుల రాకతో గ్రామాల్లోని ప్రతి ఇల్లు కళకళలాడింది. కాగా, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మలతారెడ్డి దంపతులకు మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య దంపతులు రాఖీ కట్టి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు వారికి చీరెసారె అందించి సత్కరించారు.
నర్మెట/ రఘునాథపల్లి/ జఫర్‌గఢ్/ పాలకుర్తి/ స్టేషన్ ఘన్పూర్/ తరిగొప్పుల/ కొడకండ్ల : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలు రక్షాబంధన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివిధ రకాల ఆకృతులు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు రంగురంగుల రాఖీలను తోడబుట్టినవారికి కట్టి, మంగళహారతితో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాఖీ, స్వీట్ల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి.
దేవరుప్పుల: మండలంలోని కొత్తవాడలో బాలికలు తమ ఇంట్లో ఉన్న మొక్కలకు రాఖీలు కట్టి మానవాళి మనుగడకు మొక్కల పెంపకం ప్రాముఖ్యతను చాటారు.
బచ్చన్నపేట : హైదరాబాద్‌లో ఉన్న తన సోదరడు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్‌కుమార్‌కు చెల్లి రాఖీ కట్టింది. రాఖీ పండుగను పురస్కరించుకుని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, వైస్ ఎంపీపీ అనిల్‌రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, దూడల కనుకయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
వృక్షానికి రాఖీ కట్టిన యువకులు
లింగాలఘనపురం: మండల కేంద్రంలో రక్షాబంధన్‌ను పురస్కరించుకుని యువకులు వృక్షానికి రాఖీ కట్టి చెట్లను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న పురాతన వేప చెట్టుకు రాఖీ కట్టారు. మీకు మేము రక్షణ.. మాకు మీరు రక్షణ.. అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ సోషల్‌వర్కర్ చెన్నూరి మల్లేశ్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువకులు బోయిని రాంబాబు, శ్రీశైలం, సురేశ్, జంపన్న, లింగాల ఆదిత్య, ప్యాట మహేందర్, దయ్యాల శ్రీకాంత్, కేమిడి కార్తీక్, శ్రీశైలం, గంగదేవి గణేశ్, రవి, జంపయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.
దేవరుప్పుల: రాంచంద్రాపురం సర్పంచ్ నాగంపల్లి బక్కమ్మ గ్రామపంచాయతీ సిబ్బందికి రాఖీలు కట్టి ఆదర్శంగా నిలిచారు. కారోబార్ ఈదులూరి రాజు, పారిశుధ్య కార్మికుడు పడిశాల సైదులు, వీఆర్ఏ మల్లయ్య, నర్సరీ వాచర్ పురోహిత్ బాలకృష్ణకు రాఖీలు కట్టి సన్మానించారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మైసారావు పాల్గొన్నారు.
జనగామ రూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల ప్రజలకు ఎంపీపీ మేకల కలింగరాజు, మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారదస్వామి, బండ లక్ష్మి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఉప సర్పంచులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.