ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన వాన
పంటలకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేసిన రైతులు
ములుగుటౌన్/ ములుగురూరల్/ గోవిందరావుపేట / వెంకటాపూర్/ కాటారం/ టేకుమట్ల, ఆగస్టు21: అల్పపీడన ప్రభావంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా కేంద్రలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జన జీవనం స్తంభించింది. పలు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ములుగు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మలంపల్లి, మహ్మద్గౌస్పల్లి, జాకారం, ఇంచర్ల, జంగాలపల్లితో పాటు ఇతర గ్రామాల్లో కురిసిన వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గోవిందరావుపేట మండలంలో భారీ వర్షం కురిసింది. లక్నవరం సరస్సు ప్రాంతమంతా ఆకాశం, నీరు కలిసిపోయినట్లు కుండ పోత వర్షం కురిసింది. వెంకటాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మహాముత్తారం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా వర్షాలు లేక రైతులు వరి నాట్లు వేయలేదు. శనివారం కురిసిన వర్షం పత్తి, వరి పంటల రైతులకు సంతోషాన్ని ఇచ్చింది. పలు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరింది.
పంటలకు జీవం
కాటారం మండలంలో భారీ వర్షం కురిసింది. గత నెలలో కురిసిన వర్షాలు ఆనక జాడ లేకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఒక్కసారిగా వర్షం పడటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంటలకు వేసేందుకు రైతులు ఎరువుల కొనుగోలు చేశారు. వర్షాలు పడక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని దిగాలు చెందారు. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షంతో మళ్లీ పంటలు జీవం పోసుకున్నట్లు కనిపించాయి. టేకుమట్ల మండలంలో వర్షం కురుసింది. మిర్చి తోటలు వేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు.