నర్సంపేట, డిసెంబర్ 19: జమానత్ అవసరం లేకుండా కిసాన్ క్రెడిట్‌తో రుణాలు అందిస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేటలో సెంటు భూమి లేని వ్యవసాయ ఆధారిత, ఆహార ఉత్పత్తిదారుల సంఘాలకు ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ రుణాలకు జమానత్ అవసరం లేదన్నారు. వ్యవసాయ ఆధారిత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులని వెల్లడించారు. గొల్ల కురుమలు, మత్స్యకారులు, పాడి రైతులకు కేవలం 30 పైసల వడ్డీతో 25 వేల రూపాయల నుంచి రూ. 1.60 లక్షల వరకు రుణం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కిసాన్ క్రెడిట్ కార్డు నర్సంపేటలో కలెక్టర్ చేతులమీదుగా అందించామన్నారు. అర్హులను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఇప్పటివరకు 1600 దరఖాస్తులు వచ్చాయన్నారు. రేపు నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో ప్రత్యేక క్యాంపు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ నెల 22న పాడి రైతులకు నర్సంపేటలోని ఎంబీసీ పాలకేంద్రం వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు స్వీకరణ నుంచి 30 రోజుల్లోపే సీసీ కార్డు వస్తుందన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
నల్లబెల్లి: రుద్రగూడెంలో కౌడగాని రవీందర్, రాంపూర్‌లో పోనుగంటి యశోదమ్మ, బజ్జుతండాలో జర్పుల సీతమ్మ, రుద్రగూడెంలో బైకని సూరమ్మ మృతి చెందారు. ఈ మేరకు ఎమ్మెల్యే పెద్ది బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు మొహన్‌రావు, సర్పంచ్ చింతపట్ల సురేశ్, నాయకులు ప్రభాకర్‌రావు, పోశాలు, తిరుపతి, సామ్య, జీవుల, శివాజీ, రాంసింగ్, మోహన్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు.