20న జరిగే టీఆర్ఎస్ ఆందోళలను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
జఫర్‌గఢ్, డిసెంబర్, 18 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడంతోపాటు తెలంగాణలో ఉత్పత్తయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దీనికి నిరసనగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వడంలేదన్నారు. కేంద్రం వైఖరిని సీఎం కేసీఆర్ ఎండగట్టడడంతో కక్షగట్టి రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నదని రాజయ్య అన్నారు. రాష్ఠ్రంలో కోటి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, కేంద్రం కేవలం 60 లక్షల మెట్రిక్‌టన్నులు మాత్రమే తీసుకుంటామనడం శోచనీయమన్నారు. కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 20న గ్రామ గ్రామాన బీజేపీ ప్రభుత్వ శవయాత్ర, దిష్ఠిబొమ్మల దహనం చేపట్టి నిరసన తెలుపాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.