పర్వతగిరి, డిసెంబర్ 18: రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ కపట నాటకాలు ఆడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అన్నదాతల కోసం నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని మండలాలు, గ్రామాల్లో కేంద్ర సర్కారు దిష్టిబొమ్మలను దహనం చేయాలని కోరారు.
కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు
రైతులను రాజులుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేస్తుంటే మోదీ సర్కారు మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఎమ్మెల్యే అరూరి విమర్శించారు. యాసంగిలో రైతులు వరి పంట సాగు చేసి నష్టపోవద్దని సూచించారు. వ్యవసాయ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా అన్నదాతలు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ సింగ్లాల్, మార్కెట్ డైరెక్టర్లు పట్టపురం ఏకాంతంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.