ఖిలావరంగల్, డిసెంబర్ 18: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం ఖిలావరంగల్ పడమరకోట మున్నూరుకాపు వీధిలో రూ. 60 లక్షల నిధులతో మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా కోటలో ఆకుకూరలు పండించే రైతులకు ఏ నాయకుడూ అండగా నిలువలేదన్నారు. రెండేళ్ల క్రితం ఖిలావరంగల్ పర్యటనలో భాగంగా కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు. చారిత్రక కోటను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్ది ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. గజ్జెల ఆగమ్మ, పాపయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు రామనాథం, సత్యనారాయణ, రమేశ్‌బాబు 500 గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాల్‌కు విరాళంగా ఇవ్వగా అభినందించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ తోటకూరి నర్సయ్య, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు భోగి సురేశ్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు ఇనుముల మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల శ్యామ్, సులుగం వేణుగోపాల్, తోటకూరి చేరాలు, మందాటి శ్రీధర్, మిరిపల్లి రాజు, నలిగంటి నవీన్, కాసుల ప్రతాప్, మైదం నరేశ్, చింతం అమర్వర్మ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం విధానాలను రైతులకు వివరించాలి..
కరీమాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాలను రైతులకు వివరించాలని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టనున్న ధర్నాకు సంబంధించిన విషయంపై క్యాంపు కార్యాలయంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, డైరెక్టర్లతో చర్చించారు. నియోజకవర్గంలోని రైతులందరూ ధర్నాలో పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. ధర్నా విజయవంతానికి కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.