వరంగల్-హైదరాబాద్ రహదారిపై నెల్లుట్ల వద్ద ప్రమాదం
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
బస్సులోని ప్రయాణికులు సురక్షితం
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
లింగాలఘనపురం, అక్టోబర్ 18 : వరంగల్-హైదరాబాద్ హైవేపై జనగామ జిల్లా నెల్లుట్ల సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్‌కోచ్ బస్సు దగ్ధమైంది, డ్రైవర్ అప్రమత్తతతో 26 మంది ప్రయాణికులు క్షేమం గా బయటపడ్డారు. డ్రైవర్ అబ్దుల్అహ్మద్షేక్ తెలిపిన వివరాల ప్రకారం .. హైదరాబాద్‌కు చెందిన కృష్ణప్యాలెస్ ప్రైవేటు బస్సు ప్రతి రోజూ ఛత్తీస్‌గఢ్‌లోని జగదేవ్‌పూర్‌కు ప్రయాణకులను చేరవేస్తుంది. తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి ప్రయాణికులను హైదరాబాద్‌కు తీసుకొస్తుంది. ఈ క్రమంలో 30 మంది ప్రయాణికులతోగల స్లీపర్ కోచ్ బస్సులో 26 మందితో ఆదివారం హైదరాబాద్‌కు బయలు దేరింది. సోమవారం తెల్లవారుజామున నెల్లుట్ల బైపాస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు దాటగానే బస్సు ఇంజిన్‌లో మంటలు లేచాయి. డ్రైవర్ అబ్దుల్అహ్మద్షేక్ గమనించి వెంటనే మరో డ్రైవర్ రమేశ్‌కుమార్, హెల్పర్ దీపక్‌ను అప్రమత్తం చేశాడు. బస్సు ను ఆపి ప్రయాణికులను వెంటనే కిందికి దింపారు. నిద్రిస్తున్న వారిలో కొందరిని భుజాలపై మోసుకొచ్చి దింపారు. ఇంతలో మంటలు ఎగిసిపడడంతో బస్సు అగ్నికి ఆహుతయ్యింది. విషయం తెలుసుకున్న ఎస్సై దేవేందర్ సంఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే చేరుకుని మంటలను ఆర్పేశారు. ఇదే సమయంలో హైదరాబాద్-వరంగల్ హైవే వస్తున్న వాహనాలను దారి మళ్లించారు. అనంతరం బస్సులోని ప్రయాణికులను హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో ఎస్సై దేవేందర్ తరలించారు. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, కొందరి ప్రయాణికుల లగేజీ సైతం అగ్నికి ఆహుతయ్యింది.
వేగం లేక పోవడంతో తప్పిన ముప్పు..
నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ వద్ద సూర్యాపేట- సిద్దిపేట జాతీయ రహదారిపై వంతెనను నిర్మించారు. మరోవైపు హన్మకొండ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జి సమీపంలో రోడ్డు కిరువైపులా స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేశారు. దీంతో హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ఏసీ లగ్జరీ బస్సు స్పీడ్ బ్రేకర్‌తో 15 నుంచి 20 కిలో మీటర్ల వేగానికి తగ్గించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు వేగంగా ఉంటే మంటలు వ్యాపించి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పువాటిల్లేదని పలువురు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బస్సు డ్రైవర్లను, సకాలంలో స్పందించిన ఎస్సై దేవేందర్‌ను, అగ్నిమాపక సిబ్బందిని ప్రయాణికులు, స్థానిక ప్రజలు అభినందించారు.
ఒక్కసారిగా మంటలు లేచాయి..
-అబ్దుల్ అహ్మద్‌షేక్, బస్సు డ్రైవర్
ఆదివారం సాయంత్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదేవ్‌పూర్ నుంచి 26 మంది ప్రయాణికులను ఎక్కించుకుని హైదరాబాద్‌కు బయలు దేరా. నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ల వద్ద బస్సు వేగాన్ని తగ్గించా. వంద గజాలు కూడా వెళ్లక ముందే ఇంజిన్ నుంచి మంటలు ప్రారంభమయ్యాయి. షాట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో మరో డ్రైవర్ రమేశ్‌కుమార్, హెల్పర్ దీపక్‌ను అప్రమత్తం చేసి ప్రయాణికులను భుజాలపై మోసుకెళ్లి దింపాం. ఆ సమయంలో ప్రాణభీతితో తల్లడిల్లాం. ప్రయాణికులను కాపాడాలనే ధ్యేయంతో శ్రమించాం. భగవంతుని దయతో మా శ్రమ ఫలించింది.