లింగాలఘనపురం, డిసెంబర్ 15 : మండలంలోని జీడికల్ వీరాచల సీతారామచంద్రస్వామి ఆలయానికి హుండీల లెక్కింపుతోపాటు కొబ్బరికాయల వేలం ద్వారా రూ.3.68 లక్షల ఆదాయం సమకూరింది. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొబ్బరికాయల విక్రయం కోసం వేలం నిర్వహించగా, రూ.50 వేల చొప్పున ధరావత్తు చెల్లించి ఐదుగురు వేలంలో పాల్గొన్నారు. పాలకుర్తి మండలం సిరిసన్నగూడేనికి చెందిన ప్రవీణ్ రూ.1.65 లక్షలకు వేలం దక్కించుకున్నారని ఈవో శేషుభారతి వివరించారు. గత సంవత్సరం ఈ వేలానికి రూ.1.50 లక్షలు చేకూరాయన్నారు. వేలం కాలపరిమితి 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 వరకు ఉంటుందన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించగా రూ.2 లక్షల 3 వేలు లభించాయన్నారు. ఆలయానికి మొత్తం 3.68 లక్షల ఆదాయం లభించిందని ఆమె పేర్కొన్నారు. మహబూబాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీవెంకటేశ్వర సేవాసమితి అధ్యక్షుడు నవీన్ అధ్వర్యంలో 10 మంది వలంటీర్లు హుండీలను లెక్కించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్, ఆలయ చైర్మన్ సానికె మధు, సిబ్బంది కేకే రాములు, భరత్‌కుమార్, మల్లేశం, శంకర్, కొడవటూరు ఆలయ సిబ్బంది రాజేందర్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, ఆలయ పూజారులు మురళీకృష్ణమాచార్యులు, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ డైరెక్టర్లు కారంపురి శ్రీనివాస్, పడమటింటి చొక్కమ్మ, రాజశేఖర్, గోవర్దన్, కొండబోయిన లక్ష్మణ్ పాల్గొన్నారు.