సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాక
అదేరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెన్
ఏర్పాట్లుచేస్తున్న అధికార యంత్రాంగం
జనగామ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన ఖరారైంది. ఈ నెల 20న జిల్లాకు రానున్న సీఎం.. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు అధికారిక వర్గాలు ఏర్పాట్లుచేస్తున్నాయి. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండనుంది. ఈ సభకు జిల్లాలోని పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల నుంచి జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు, జనసమీకరణ, ఇతర అంశాలపై మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఆ జిల్లా ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ గతేడాది అక్టోబర్ 31న కొడకండ్లకు వచ్చారు. రైతు వేదిక ప్రారంభోత్సవాలకు ఇక్కడే శ్రీకారం చుట్టారు. తాజాగా కొత్త జిల్లాగా ఏర్పడిన జనగామ కలెక్టరేట్ కొత్త భవనం ప్రారంభించేందుకు వస్తున్నారు.