కమలనాథులవి చిల్లర రాజకీయాలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం
కమలాపూర్, ఆగస్టు 14 : హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు బీజేపీ కుట్రలో పడొద్దని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. శనివారం కమలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, ఆలయాల్లోకి దళితులను రాకుండా సామాజిక వివక్షతో ఊరికి దూరం పెట్టిందే ఆ పార్టీ అని మండిపడ్డారు. దళిత బంధుపై దళితుల్లో విషబీజాలు నాటేందుకు బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బందు పథకం విప్ల వం లాంటిదని, తెలంగాణలో అమలయితే దేశంలో అమలయ్యే అవకాశం ఉందన్నారు. ఎలాగైన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయకుండా అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఏ నాయకుడు దళితుల గురించి ఆలోచన చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతో దళిత బంధు పథకం తీసుకొస్తే బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదన్నారు. దళిత బంధు పథకం పారదర్శకంగా అమలు జరుగుతుందని, ఎవరూ అపోహలకు గురికావద్దని సూచించారు. దళితబంధుపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీని హుజూరాబాద్ ఉప ఎన్నికలో బొంద పెట్టాలని ప్రజలను కోరారు. దళితబంధు పథకం ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 16న శాలపల్లిలో జరిగే ముఖ్యమంత్రి సభకు భారీగా తరలి రావాలన్నారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 15 కుటుంబాలకు పంపిణీ చేసి, దళితబంధు అమలుపై స్పష్టంగా వివరిస్తారని వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ఇప్పటికే రూ. 2వేల కోట్లు కేటాయించారన్నారు. 20 వేల కుటుంబాలకు యూనిట్లు వస్తాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇన్చార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, పీఏసీఎస్ డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, నాయకులు మౌటం కుమారస్వామి, పుల్ల శ్రీనివాస్ తదితరులున్నారు.