రైతులు, ఉద్యోగుల భాగస్వామ్యం
నేటి స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం
దేవరుప్పుల, ఆగస్టు 14 : మండల కేంద్రంలోని 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను విద్యుత్ ఉద్యోగులు శ్రమదానంతో సుందరీకరించి స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం చేశారు. 1997లో ఉమ్మడి రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రెండెకరాల ప్రభుత్వ స్థలంలో రైతులు తమ విద్యుత్ కష్టాలు తొలగించుకునేందుకు శ్రమదానం చేశారు. 18 రోజుల్లో సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేయడమేగాక విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించారు. ఆనాడు ఈ సబ్‌స్టేషన్‌ను నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు, వరంగల్ ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ పురుషోత్తమరావు ప్రారంభించారు. అనంతరం సబ్‌స్టేషన్‌కు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ప్రసుత్తం ఇక్కడ పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది శ్రమదానం చేసి సబ్‌స్టేషన్‌ను సుందరీకరించారు. దేవరుప్పుల, లింగాలఘనపురం మండలాలకు కలిపి విద్యుత్‌శాఖ ఏడీ ఉండగా వారి నేతృత్వంలో ఉద్యోగులు శ్రమించి హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇక్కడే విద్యుత్ మండల కార్యాలయం ఉండగా దాని చుట్టూ పచ్చని గడ్డి పెంచి సబ్‌స్టేషన్ రూపురేఖలను మార్చారు. మరోవైపు సబ్‌స్టేషన్ స్తంభాలకు రంగులు వేయడమేకాక, మెయింటనెన్స్ పనులు పూర్తిచేసి ఆహ్లాదకర వాతావరణం లో సర్వాంగసుందరంగా మార్చారు.
జిల్లాలోనే మోడల్ సబ్‌స్టేషన్‌గా మార్చాం..
దేవరుప్పుల సబ్‌స్టేషన్‌ను జిల్లాలోనే మోడల్ సబ్‌స్టేషన్‌గా మార్చాం. రైతులు శ్రమదానంతో సబ్‌స్టేషన్ నిర్మించుకోగా, ఉద్యోగులు ఉన్నతాధికారుల సహకారంతో సబ్‌స్టేషన్ ప్రాంగణాన్ని, ఏడీ కార్యాలయాన్ని సుందరీకరించాం. దీంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విద్యుత్ శాఖ ఎస్ఈ మల్లికార్జున్ హాజరై సబ్‌స్టేషన్ ప్రాంగణంలో నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.