విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ శశాంక
గూడూరు మండలకేంద్రంలోని సీహెచ్‌సీ తనిఖీ
అన్ని వసతులున్నా ప్రజలకు వైద్యం అందకపోవడంపై ఆగ్రహం
దవాఖానలో శుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశం
గూడూరు, నవంబర్11: సర్కారు దవాఖానలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని ప్రసూతి విభాగం, ఓపీ, ఆయూష్, డెంటల్ క్లినిక్ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రాములు, తహసీల్దార్ శైలజ, సీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని హంగులతో దవాఖానను నిర్మించి వైద్య పరికరాలు అందుబాటులో ఉంచినా ప్రజలకు వైద్యసేవలు అందకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యవహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దవఖాన ఆవరణ, బయట శుభ్రత ముఖ్యమని, వారంలో రెండు రోజులు పరిసరాలను శుభ్రం చేసి ఫొటోలు తనకు పంపించాలన్నారు. ప్రసవాల సంఖ్య పెరుగాలని, హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ వంటి చిన్నచిన్న ఆపరేషన్లు దవాఖానలోనే జరగాలన్నారు. వైద్యసేవలు మెరుగుపర్చి ప్రజల మన్నలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఛత్రూనాయక్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, వైద్యులు భరత్‌రెడ్డి, రాజ్కట్టయ్య, శివశంకర్, అరవింద్, శశిధర్‌రెడ్డి, ప్రావీణ్య, సంతోష్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.