ఏ తోవలో నడుస్తారో ఆలోచించుకోండి
రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు
బుజూనూర్లో ధూంధాం
ఇల్లందకుంట, అక్టోబర్ 9: ‘బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీ లేదు. చేయబోయేది లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచుడు.. ప్రజలను ఇబ్బందులు పెట్టుడు తప్ప రూపాయి లాభం లేదు. ఈ ఉప ఎన్నికలో మీకు అన్నివిధాలా అండగా నిలిచి, సంక్షేమ పథకాలు ఇచ్చే టీఆర్ఎస్ కావాలా..? ధరలు పెంచే బీజేపీ కావాలా..? ఆలోచించుకోండి. ఏ తోవలో నడుస్తారో తేల్చుకోండి’ అంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బుజూనూర్లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి హాజరుకాగా, కళాకారులు డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు రాజేందర్‌ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం కేసీఆర్ రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. ‘కానీ రాజేందర్ ఏం చేసిండు. నియోజకవర్గ ప్రగతిని విస్మరించిండు. ఇప్పుడు బీజేపీలో చేరి తల్లి పాలు రొమ్ము గుద్దినట్లుగా మాట్లాడుతున్నడని’ దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇంటి స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న ఓటేసేందుకు వెళ్లే మహిళలు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకోవాలని, కారు గుర్తుకు ఓటేసి గెల్లును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధూంధాంలో కళాకారులు పాడిన పాట, ఆడిన ఆట ఆకట్టుకున్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ పావని వెంకటేశ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్ అరుణ, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు సదానందం, వాసుదేవరెడ్డి ఉన్నారు.