విద్యార్థులు ఎంచుకున్న రంగాలు సమాజానికి ఉపయోగపడాలి
నిట్ 19వ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్
సీవోఈ, హిటాచీ స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ల్యాబోరేటరీలు ప్రారంభం
హనుమకొండ సిటీ, అక్టోబర్ 9 : భారత్‌ను మెరుగైన దేశంగా తీర్చిదిద్దడానికి విద్యార్థులు శ్రమించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. వర్చువల్ పద్ధతిలో శనివారం నిర్వహించిన నిట్ 19వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు పొందిన విద్యార్థులకు కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. కొంతమంది ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారని, మరికొంతమంది ఉన్నత చదువులు కొనసాగిస్తారని వివరించారు. సమాజానికి ఉపయోగపడే రంగాలను విద్యార్థులు ఎంచుకోవాలని కోరారు. ఉత్పాదక రంగంలో అనేక సంస్కరణలు వస్తుండడంతో సాంకేతిక మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఉందన్నారు. అనంతరం సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ), హిటాచీ స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ల్యాబోరేటరీలను ప్రారంభించారు. ధ్యాన్‌చంద్ మల్టీపర్సప్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సివిల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ బిల్డింగ్ కాంప్లెక్స్ శిలఫలకాలను ఆవిష్కరించారు. సీవోఈ ప్రారంభంతో పాటు శిలాఫలకాలు ఆవిష్కరించడం వరంగల్ నిట్‌కు చిరస్మరణీయమైన రోజు అని మంత్రి తెలిపారు.
బహుళజన క్రమశిక్షణ సంస్థగా నిట్
నిట్ వరంగల్ బహుళజన క్రమ శిక్షణ సంస్థగా మారిందని గౌరవ అతిథి, ఇస్రో మాజీ చైర్మన్, నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ అన్నారు. నూతన విద్యావిధానం సమగ్ర, సౌకర్యవంతమైన విధానాన్ని అందిస్తుందన్నారు. ఎన్ఈపీ 21 శతాబ్దంలో ప్రజల అవసరాలను గుర్తించి, విద్యార్థులకు సరళంగా మారుతుందన్నారు. ఆర్ఈసీని జాతీయ ఖ్యాతి కలిగిన సంస్థగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నిట్ సిబ్బందిని ఆయన అభినందించారు. వరంగల్ నిట్‌ను ప్రభావితం చేయడంలో డైరెక్టర్ ఎన్వీ రమణారావు అపారమైన విద్య అనుభవం ఉపయోగపడుతుందన్నారు. డైరెక్టర్ రమణారావు మాట్లాడుతూ గత ఏడాది నుంచి నిట్‌లోని విద్య, పరిశోధనల పురోగతి గురించి వివరించారు. ఈ విద్యా సంవత్సరం నిట్ ఐవోటీ, ఏఐ తదితర డిమాండ్ ఉన్న సెల్ప్ ఫైనాన్స్ కోర్సులను అందిస్తున్నట్లు వివరించారు. నిట్ ఫ్యాకల్టీ సభ్యులు వారి అత్యుత్తమ రచనల కోసం వివిధ ఫోరంలలో గుర్తింపు పొందారని ప్రస్తావించారు. అనంతరం నిట్ రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్‌రావు బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. డైరెక్టర్ ఎన్వీ రమణారావు విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.