జనగామ చౌరస్తా, నవంబర్ 7 : కస్తూర్బా పాఠశాలల విద్యార్థినులకు చదువుతోపాటు సృజనాత్మక కళలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వారికి విజ్ఞానంతోపాటు స్వయం ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు. వృత్తి విద్య తరహాలో ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే చేతివృత్తిలో నైపుణ్యం పొందితే భవిష్యత్‌లో ఆదాయ మార్గం సులువుగా ఉంటుందనే భావనతో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 12 మండలాల్లో 12 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థినుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు చేతివృత్తులైన అల్లికలు, కుట్లు, హోం డెకరేటింగ్కు సంబంధించిన విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా పేపర్ ఫ్లవర్స్, టేబుల్ క్లాత్, ఫ్లవర్ వాజ్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, ముత్యాల హారా లు, డిజైన్ గాజులు, ఫొటో ఫ్రేమ్‌లు, డోర్ మ్యాట్స్, చిన్న పిల్లలకు గౌన్లు, జాకెట్లు, చేతి రుమాళ్ల వంటి ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థినులు తయారు చేసిన కళాకృతులను 15 ఆగస్టు స్వాతంత్య్ర దినోత్సవం, 26 జనవరి గణతంత్ర దినోత్సవం రోజుల్లో నిర్వహించే ప్రత్యేక స్టాల్స్‌లో వీటిని ప్రదర్శిస్తున్నారు. కస్తూర్బా వి ద్యార్థినులు తయారు చేసిన కళాకృతులను నాటి జిల్లా కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డితో పాటు విదేశీయులు సైతం పరిశీలించి విద్యార్థినులతోపాటు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు వారిలో దాగివున్న ప్రతిభను వెలికితీసేలా తర్ఫీదు ఇస్తున్నారు. చదువు అనంతరం స్వయం ఉపాధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
విద్యతోపాటు చేతివృత్తుల్లో శిక్షణ
కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు ప్రభుత్వ సహకారం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుగైన విద్యతో పాటు చేతివృత్తుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థినుల్లోని సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు కేజీబీవీలు చక్కని వేదికలు ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తున్నాయి. వీటితో భవిష్యత్‌లో విద్యార్థులకు స్వయం ఉపాధి మార్గాలు కూడా సులువుగా లభించే అవకాశం ఉంది. పాఠశాలలోని విద్యార్థినులు కుట్లు, అల్లికలు, ఫ్లవర్‌వాజ్‌లు, పేపర్ ఫ్లవర్స్, టేబుల్ క్లాత్‌లు, గౌన్లు, ముత్యాల హారాలు, డిజైన్ గాజులు తయారు చేయడంలో నైపుణ్యం సాధిస్తున్నారు. చేతివృత్తుల తయారీలో అవగాహన వస్తున్నందున భవిష్యత్‌లో విద్యార్థినులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
-సంయుక్తరాణి, కేజీబీవీ సెక్టోరియల్ ఆఫీసర్, జనగామ
.