కలెక్టర్ గోపి దుగ్గొండి, వెంకటాపురం, తొగర్రాయిలో పరిశీలన
వాటర్ ట్యాంకు నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాతకు సన్మానం
దుగ్గొండి హోమియోపతి వైద్యురాలి పనితీరుపై అసంతృప్తి
దుగ్గొండి, అక్టోబర్ 7: కరోనా వ్యాక్సినేషన్‌ను జిల్లాలో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి వైద్యాధికారులను ఆదేశించారు. మండలంలోని తొగర్రాయి, వెంకటాపురం, దుగ్గొండిలో గురువారం ఆయన స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. తొగర్రాయిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామానికి తొలిసారి వచ్చిన కలెక్టర్‌ను ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ వెంకటాపురంలో టీకా సెంటర్‌ను పరిశీలించారు. తర్వాత గ్రామంలో నిర్మించతలపెట్టిన మిషన్ భగీరథ వాటర్ టాంక్‌ను కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థలాన్ని అందించిన దాత హింగె రామారావును కలెక్టర్ ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఓపీ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. హోమియోపతి వైద్యశాల నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యురాలు గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖానలో వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించి గ్రామాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, హింగోళి రాజేశ్వర్‌రావు, వైద్యాధికారి రాజు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్‌కు సహకరించాలి
గ్రామాల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేందుకు స్థానికులు సహకరించాలని ముత్యాలమ్మతండా, భోజ్యానాయక్‌తండా సర్పంచ్‌లు భూక్యా సైద, భూక్యా లలిత కోరారు. ఆయా తండాల్లో 18 ఏళ్లు నిండిన వారికి వైద్య సిబ్బంది టీకాలు వేశారు. పర్వతగిరి మండలం రావూరులో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసినట్లు పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్ ముఖర్జీ తెలిపారు. గురువారం వైద్య సిబ్బంది విక్టరీని చూపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి సంతోష్, ఉపసర్పంచ్ కార్యదర్శి రాజు, ఏఎన్ఎం ఉష, ఆశవర్కర్ లావణ్య పాల్గొన్నారు. ఖానాపురం మండలంలోని పర్షతండాలో వందశాతం టీకా కార్యక్రమం పూర్తయినట్లు మండల వైద్యాధికారి మ ల్యాల అరుణ్‌కుమార్ తెలిపారు. గ్రామంలో 128 మంది అర్హులు ఉండగా అందరికీ టీకాలు వేశామన్నారు.