మేడారానికి భారీగా వస్తున్న భక్తజనం
బంధుమిత్రులతో కలిసి దర్శనం
సమీపిస్తున్న మహాజాతర
వనదేవతలకు మొక్కుల చెల్లింపు
తాడ్వాయి, జనవరి 7 : ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహాజాతరకు సమయం దగ్గర పడుతుండడంతో భక్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. శుక్రవారం భక్తులు తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కొందరు కల్యాణకట్టలో తల్లులకు తలనీలాలు సమర్పించారు. వాగు ఒడ్డున ఉన్న జంపన్న, నాగులమ్మ దేవతలకు పూజలు చేశారు. అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకుని క్యూ కట్టారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్ల్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతనవస్ర్తాలు, పూలు, పండ్లు, సారె, ఒడిబియ్యం సమర్పించారు. జాతర పరిసరాల్లో వంటలు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో విందు భోజ నాలు చేశారు. వరంగల్‌కు చెందిన ఓ భక్తుడు తన బిడ్డకు తల్లుల గద్దెల ఆవరణలో అన్నప్రాసన చేశాడు.
గద్దెల సుందరీకరణ పనులు ప్రారంభం
మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను పురస్కరిం చుకుని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం సుందరీ కరణ పనులను శుక్ర వారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రారంభించారు. నిధులు మంజూరు కావడంతో రంగులు వేసే పనులను స్థానిక యువజన సంఘం సభ్యులకు అప్పగించారు. గద్దెల చుట్టూ ఉన్న సాలహారంతోపాటు నాలుగు వైపులా ఉన్న ఆర్చిగేట్లకు రంగులు వేయనున్నారు. యూత్ అద్యక్షుడు బోజారావు, యూత్ సభ్యులు సమ్మారావు, అనిల్, వెంకట్ ఉన్నారు. కాగా, మేడారంలోని జంపన్నవాగు ఒడ్డున ఐబీ శాఖ అధికారులు చాటు గదులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాత మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు చాటు గదులను ఏర్పాటు చేస్తున్నారు. వాగు వెంట ఎనిమిది కిలోమీటర్ల మేర ఉన్న స్నానఘట్టాలపై రెండు వైపులా నిర్మిస్తున్నారు.