నర్మెట మండలానికి ప్రాణం పోసిన నాలుగు జలవనరులు
‘మల్లన్నగండి’ కింద 4వేల ఎకరాల ఆయకట్టుకు సాగనీరు
బొమ్మకూర్ రిజర్వాయర్‌తో 31వేల ఎకరాలకు..
వెల్దండ రిజర్వాయర్ ద్వారా 12,500 ఎకరాలకు జీవం
‘కన్నెబోయినగూడెం’ ద్వారా 14వేల ఎకరాలకు..
నర్మెట, సెప్టెంబర్ 6 :ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎత్తయిన ప్రదేశంగా ఉండి ఒకప్పుడు తాగు, సాగునీటికి అలమటించిన నర్మెట మండలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన నాలుగు రిజర్వాయర్లు కల్పతరువులుగా మారాయి. ఇక్కడి సారవంతమైన నల్లరేగడి, ఎర్రనేలల్లో సిరులు పండించేందుకు అపర భగీరథుడు సీఎం కేసీఆర్ పుణ్యమా అని గోదావరి జలాలు తరలివచ్చాయి. కాలానికి అతీతంగా గోదావరి నీటితో జలాశయాలను నింపుతుండగా వీటి కింద సాగవుతున్న పంటలతో ఇప్పుడు మండలంలోని ఏ గ్రామం చూసినా సస్యశ్యామలంగా కనిపిస్తున్నది.
ఒకప్పుడు తాగు, సాగునీటికి అలమటించిన ప్రాంతం.. ఏ గ్రామంలో చూసినా కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎత్తయిన ప్రదేశం.. సారవంతమైన నల్లరేగడి, బలమైన ఎర్రనేలలు, కాకతీయుల కళావైభవాలతోకూడిన దేవాలయాలు ఉన్న నేల.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మండలంలో ఉన్న నాలుగు రిజర్వాయర్లు గోదావరి జలాలలో కళకళలాడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా పచ్చని పంటలు కనువిందుచేస్తున్నాయి. రిజర్వాయర్ల ద్వారా నీటిని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నింపుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలోని నర్మెట మండలంలో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. మల్లన్నగండి, బొమ్మకూరు, వెల్దండ, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లు ఉన్నాయి.
మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సహజ సిద్ధంగా మల్లన్నగండి రిజర్వాయర్ ఏర్పడింది. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ 0.40 టీఎంసీల సామర్థ్యం గలది. నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. గండిరామవరం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని పత్తేపూర్, తాటికొండ గ్రామాల భూములకు సాగునీరు అందిస్తున్నారు.
0.198 టీఎంసీల సామర్థ్యం కలిగిన బొమ్మకూరు రిజర్వాయర్‌ను రూ.27 కోట్ల నిర్మించారు. నర్మెట, జనగామ, బచ్చన్నపేట మండలాల పరిధిలోని 31వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది.
0.15 టీఎంసీల సామర్థ్యంతో వెల్దండ రిజర్వాయర్‌ను రూ.10.27 కోట్లతో నిర్మించారు. 12,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది.
0.120 టీఎంసీల సామర్థ్యం కలిగిన కన్నెబోయినగూడెం రిజర్వాయర్‌ను రూ.15 కోట్లతో నిర్మించారు. కేశిరెడ్డిపల్లి, గోపరాజుపల్లి, పెద్దపహాడ్, బచ్చన్నపేట, కొడ్వటూర్ తదితర గ్రామాలోని 14 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. చుట్టు పక్కల మండలాల రైతులకు నర్మెట మండలంలో ఉన్న నాలుగు రిజర్వాయర్లు కల్పతరువుగా మారాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషి చేస్తున్నారు. చెరువులు, కుంటలకు కాల్వల ద్వారా సాగు నీరు అందించాలనే స్థానిక ఎమ్మెల్యే కాల్వలను స్వయంగా పరిశీలించి పనులను చేయిస్తున్నారు. దీంతో ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాలు అందుతున్నాయని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.