వరంగల్‌చౌరస్తా/పోచమ్మమైదాన్, జనవరి 4: గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికే నగరబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, వివిధ విభాగాల అధికారులతో కలిసి మంగళవారం ఆమె వరంగల్‌లోని పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా 24వ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మూత్రశాలలకు మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డుకు అడ్డుగా, నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గద్దెను తొలగించాలని కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఎల్లమ్మబజార్ సెంటర్లో రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎల్లమ్మబజార్లోని గ్రంథాలయ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరగా, ఇక్కడ తగిన స్థలం లేనందున మట్టెవాడలో మోడల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మేయర్ 21, 22, 23వ డివిజన్లలోని పలు ప్రాంతాలను కమిషనర్ ప్రావీణ్యతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఎల్బీనగర్లోని హిందూ ముక్తిస్థల్ను పరిశీలించారు. ప్రహరీ ఏర్పాటు చేయాలని సూచించారు. తిలక్‌రోడ్డులో మిషన్ భగీరథ పనుల వల్ల వాటర్ సరఫరా కావడం లేదని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు.
రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరారు. 22వ డివిజన్ ఎస్సీకాలనీలో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు, దెబ్బతిన్న రోడ్డు, డ్రైనేజీ మరమ్మతులు, శాంతినగర్, మర్రి వెంకటయ్యకాలనీలో నూతన డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ఆమె దృష్టికి తీసుకురాగా, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తోట మైదానంలో ప్రహరీ, వాకింగ్ ట్రాక్, కోనేరును శుభ్రం చేయించి, దీనిపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని వాకర్స్ మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తవాడలోని అంధుల పాఠశాలలో టాయ్‌లెట్స్, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు కమ్యూనిటీ హాల్‌కు మరమ్మతులు చేయాలని, మల్లికార్జున హాస్పిటల్ లేన్‌లో రోడ్డు, డ్రైనేజీ పనుల విషయమై కార్పొరేటర్ ఆడెపు స్వప్న మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, ఎంహెచ్వో డాక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ కమిషనర్ జానా, డీఫ్వో కిశోర్, సీహెచ్‌వో సునీత, ఈఈ శ్రీనివాసరావు, డీఈలు నరేందర్, రవి కిరణ్, సంజయ్‌కుమార్, రవి కిరణ్, పబ్లిక్ హెల్త్ డీఈ ఇస్రట్ జహన్, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధికి కృషి
కాశీబుగ్గ: వరంగల్ 19, 20 డివిజన్లలో మేయర్ గుండు సుధారాణి కమిషనర్ ప్రావీణ్యతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతి మంగళవారం ఆరు డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. 19వ డివిజన్లోని పైపులైన్ లీకేజీ, డ్యామేజ్రోడ్లు, డివిజన్లోని శ్మశాన వాటికలో సమస్యలను పరిశీలించారు. మిషన్ భగీరథ లీకేజీలను వెంటనే అరికట్టాలని అధికారులను ఆదేశించారు. 20వ డివిజన్లోని బిన్రావుకాలనీ, పద్మనగర్, శాంతినగర్‌లో అంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలన్నారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వారి వెంట సాంబయ్య, లక్ష్మణ్, అశోక్‌కుమార్ ఉన్నారు.