జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 2 : ఆగిపోయిన చదువు తిరిగి కొనసాగించుకోవాలనుకునే వారికి ఓపెన్ స్కూల్ ఓ వరమని జయశంకర్ భూపాలపల్లి డీఈవో అబ్దుల్ హై అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ మురాల శంకర్రావు అధ్యక్షతన జిల్లాలోని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అబ్దుల్‌హై హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లను డీఈవో ప్రారంభించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులు వారి విద్యార్హతలు పెంపొందించుకునేందుకు ఓపెన్ స్కూల్, దూరవిద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఓపెన్ స్కూల్ డ్రాపౌట్ విద్యార్థులందరికీ ఒక వరంలాంటిదన్నారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 10వ తేదీ వరకు, అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. అడ్మిషన్లు పొందే విద్యార్థులు ఆన్లైన్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చూ డాలని కో ఆర్డినేటర్లకు సూచించారు. కార్యక్రమంలో ఏడీ రాజిరెడ్డి, జీసీడీవో శివరంజని, జిల్లా కో ఆర్డినేటర్లు బుర్ర సదయ్య, రమేశ్, బిల్ల రాజిరెడ్డి, పసునూటి రవి, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, శ్రీధర్‌బాబు, రాంధన్ పాల్గొన్నారు.
విద్యార్థులకుఇబ్బందులు లేకుండా చూడాలి : డీఈవో
కాటారం, సెప్టెంబర్ 2 : విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని డీఈవో అబ్దుల్‌హై అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజన బియ్యం, పాఠశాల ఆవరణను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలాంటి భయాందోళనలు లేకుండా పాఠశాలకు రావాలన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలన్నారు. ఆయన వెంట ఎంఐఎస్ కో ఆర్డినేటర్ సుదర్శన్, ఉపాధ్యాయులు జయరాజ్, రవీందర్, తదితరులు ఉన్నారు.