ప్రతి రైతు కుటుంబం గోవులను పెంచుకోవాలి
సేంద్రియ వ్యవసాయం లాభదాయకం
తెలంగాణ రాష్ట్ర గోశాలల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్అగర్వాల్
రాయపర్తి, ఆగస్టు 14: వ్యవసాయ అనుబంధ రంగమైన పశు పోషణను చేపట్టి రైతులు బహుళ ప్రయోజనాలు పొందాలని తెలంగాణ రాష్ట్ర గోశాలల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ సూచించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి శివారు వాంకుడోతుసర్వ తండాలో పది నిరుపేద రైతు కుటుంబాలకు శ్రీవినాయక గోశాల నేతృత్వంలో రెండేసి లేగదూడలను శనివారం ఉచితంగా అందజేశారు. ముఖ్య అతిథిగా మహేశ్ అగర్వాల్ హాజరై మాట్లాడారు. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు కుటుంబం తప్పనిసరిగా గోవులను పెంచుకోవాలని కోరారు. గోమూత్రం, గోవుల పేడతో సేంద్రియ వ్యవసాయం చేస్తే పంటలు బాగా పండుతాయన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్న సంకల్పంతో గోశాలల నేతృత్వంలో గోమయ రాఖీలను తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం శ్రీవినాయక గోశాల ప్రతినిధులు తయారు చేయించిన గోమయ రాఖీలను ఆయన సర్పంచ్ లకావత్ సమ్మక్కభాస్కర్నాయక్, గోశాల అధ్యక్షుడు లావుడ్యా మంజ్యానాయక్, శోభ, భాస్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గోశాలల ప్రతినిధులు గణేశ్‌నాయక్, కిరణ్ పాల్గొన్నారు.
జగ్గిపేటలో లేగదూడెల పంపిణీ
వర్ధన్నపేట: మండలంలోని జగ్గిపేటలో రైతులకు మహేశ్ అగర్వాల్ ఆధ్వర్యంలో లేగదూడెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను సంరక్షించడం ద్వారానే రైతు కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. రైతులు గో ఆధారిత వ్యవసాయం చేస్తే మంది దిగుబడి వస్తుందని, ఈ పంటల ఆహారం తిన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. రైతులు గోవులను విరివిగా పెంచుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి రాజేశ్వర్, స్థానిక ప్రతినిధి యాకూబ్, రైతులు పాల్గొన్నారు.