‘ఆయన ఏందేందో మాట్లాడుతాండు.. ఏమంటున్నడో అర్థమైతలేదు’ ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన సంగ్రామ యాత్రలో స్థానికుల స్పందన.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు శివారు నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైన యాత్ర స్థానిక కార్యకర్తలు, నాయకులు లేక చప్పగా సాగింది. కార్యక్రమానికి హాజరైనవారంతా మహిళా కూలీలు, మైనర్లే కావడం ఇక్కడివారెవరూ లేకపోవడం, సంజయ్ మాట్లాడుతున్నంత సేపూ అక్కడున్నవారంతా అర్థంకాక బిత్తరచూపులు చూడడం కనిపించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు స్థానికుల నుంచి స్పందన కరువైంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు శివారు నుంచి మంగళవారం ఆయన యాత్ర కొనసాగించగా సభలో ఆయన మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కాక బిత్తర చూపులు చూడడం కనిపించింది. ఓ దశలో ఆయనే మధ్యమధ్యలో ‘చప్పట్లు కొట్టరా’ అని అడగడం కనిపించింది. పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభ స్థానిక ప్రజలు, నాయకులెవరూ లేక వెలెవెలబోయింది. బండి వెంట వచ్చిన బౌన్సర్లు, గూండాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తప్ప నియోజకవర్గం నుంచి గాని, పాలకుర్తి మండలం నుంచి గాని ఎవరూ రాలేదు. కేవలం మండలంలోని ఓ పది ఇరవై మంది కార్యకర్తలే యాత్రలో పాల్గొన్నారు. సభలో సంజయ్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. సభకు రావాలని బీజేపీ శ్రేణులు కూలీ ఇచ్చి మహిళలను తీసుకురావడం కనిపించింది. మైనర్లను యాత్రకు తీసుకురావడం విమర్శలకు దారితీసింది. సంజయ్ ప్రసంగం ఆవేశంగా, విద్వేషాలు రెచ్చగొట్టేలా కొనసాగిందని కొదరు చర్చించుకోవడం కనిపించింది.
అన్నా.. నేనే సారీ చెప్తున్న..
పాలకుర్తి సభలో బీజేపీ నాయకుడు ఎన్ వెంగళ్రావు డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జర్నలిస్టులు సంజయ్ వాహనం ఎదుట పెద్ద పెట్టున నిరసనకు దిగారు. దీంతో తేరుకున్న సంజయ్ అన్నా.. ‘నేనే సారీ చెప్తున్న’ అంటూ జర్నలిస్టులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
సీపీని తిట్టేందుకే యాత్రనా?
వరంగల్ పోలీస్ కమిషనర్‌ను తిట్టేందుకే ఉమ్మడి జిల్లాలో బండి సంజయ్ యాత్ర చేస్తున్నాడా అని కొందరు రాజకీయ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. నిన్న దేవరుప్పులలో సీపీని తిట్టడం ప్రారంభించిన బండి నేడు పాలకుర్తిలోనూ పోలీస్ కమిషనర్‌ను ఆసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని పలువురు చర్చించుకుంటున్నారు. తన ప్రసంగంలో సంజయ్ 10నుంచి 15నిమిషాల పాటు సీపీనే టార్గెట్ చేసి మాట్లాడాడు. సీపీపై సంజయ్ చేసిన విమర్శలను పలువురు తప్పుబట్టారు.