జనగామ, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఎందరో కళాకారులు, కవులు, రచయితలు, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులకు జన్మనిచ్చిన జనగామ నేలపై అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సందర్భాన్ని జీవితకాలం గుర్తుంచుకుంటానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన జనగామ జిల్లాకు వచ్చారు.
ఉదయం కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై వివిధ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన ప్రముఖ కవులు, కళాకారులు, రాష్ట్ర, జాతీయ పురసార గ్రహీతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ తన పాటతో అలరించారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు, చారిత్రక ఆలయాలు, ప్రసిద్ధిగాంచిన ప్రాంతాల విశిష్టతను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా పేరిణి, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను తిలకించారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. చేనేత ఉత్పత్తి కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి తన పరిపూర్ణ సామర్థ్యాన్ని చేరుకోవడానికి చేసిన పోరాటంగా ఆయన అభివర్ణించారు. సమాజ పరివర్తన, విధి విధాన రూపకర్తలు ఒకే వేదికపై ఇరువైపులా ఆసీనులై ఉండటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌ను అభినందిస్తూ, ఇటువంటి వసతుల కల్పన ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. జిల్లాలో గడిపిన ఈ కొద్ది సమయం తనకెంతో మధురానుభూతిని అందించిందని తెలిపారు. ఇకడి ప్రజల ప్రేమ, ఆప్యాయతలు, అధికారుల ఆతిథ్యాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువని, ఇక్కడ మొదలైన ఆందోళనలు, ఉద్యమాలు తర్వాతి కాలంలో వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెంది రాష్ట్రాన్ని ప్రభావితం చేశాయన్నారు.
చిన్న జిల్లా అయినప్పటికీ యువశక్తిని కలిగి ఉందన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఒకప్పుడు నిరుపేద జిల్లాగా ఉన్న జనగామ ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాగా పేరొందిందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇతర ప్రాంతాలతో పోలిస్తే జనగామ జిల్లా అనేక ప్రత్యేకతలు కలిగి ఉందన్నారు. నిజాం, అతని అనుచరులకు వ్యతిరేకంగా అనేక విప్లవాత్మక ఉద్యమాలకు, ఆందోళనలకు జన్మస్థలమని, అదే సమయంలో అనేక సాహిత్య, సాంసృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిందని పేరొన్నారు.
ఓబుల్ కేశ్వాపూర్ టూరిస్ట్ హబ్ కావాలి
జనగామ రూరల్ : ఓబుల్ కేశ్వాపూర్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్‌గా తయారు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్న అన్నారు. తాను తొలిసారి గ్రామాల్లో పర్యటించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఓబుల్ కేశ్వాపూర్ గ్రామానికి వచ్చిన గవర్నర్‌కు మహిళలు కోలాటంతో స్వాగతం పలికారు. గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడే మొక్కలు నాటారు. ఆలయం ఆడిటోరియంలో కవులు, కళాకారులు, మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తన కార్యాలయ కార్యదర్శి గ్రామంలోని ఆలయం చిన్నదిగా ఉంటుందనుకున్నానని, కానీ చాలా పెద్దదిగా ఉందన్నారు. ఆలయం బాగుందని కితాబిచ్చారు. బుర్ర వెంకటేశం మాట్లాడుతూ గవర్నర్ మన గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గవర్నర్ పర్యటన విజయవంతానికి పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సరిత, డీఆర్డీవో వసంత, ఎంపీడీవో ఉప్పుగల్లు సంపత్ కుమార్, గవర్నర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.