ఉమ్మడి జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోగా జనజీవనం స్తంభించింది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 25
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం పొద్దం తా వర్షం పడింది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో ప్రజలు ఇం డ్లకే పరిమితమయ్యారు. జిల్లాలో 19.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కాటారం మండలంలో గోపాల్పూర్ వాగు ఉప్పొంగి వరి పొలాలు వరద నీటితో నిండి చెరువును తలపిస్తున్నాయి. భారీ వర్షంతో చెరువులు మరోసారి మత్తుళ్లు దుంకుతున్నాయి. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి లోలెవల్ వాగుతో అటవీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.
మహదేవపూర్ మండలం అన్నారం-చండ్రుపల్లి లోలెవల్ వంతెనపై భారీ గా వరద ప్రవహిస్తుడడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, మల్లంపల్లిలో వర్షంతో రోడ్లపై పలు చోట్ల నీళ్లు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మేడారంలోని జంపన్నవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండలంలోని కాల్వపల్లి సమీపం లోని వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవ హించడంతో దాన్ని దాటేందుకు ప్రయత్నించిన రెండు గేదెలు కొట్టుకుపోయాయి. గ్రామస్తులు వాటిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూ డెం దగ్గరలోని హనుమంతుని వాగు వద్ద బ్రిడ్జి ని తాకుతూ వరదనీరు ఉరకలు వేస్తున్నది. వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామ శివారులోని రేగుమాగు వాగు బ్రిడ్జి వద్ద ఉన్న హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం(నూగూరు) మండలంలో ప్రధాన రహ దారిపై చెట్లు నేలకొరిగాయి. వరంగల్ నగరంలో రోజంతా వాన కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. చెరువులు అలుగు పోస్తున్నాయి. వ్యాపారాలు బోసిపోయాయి.
ఉరకలెత్తుతున్న గోదావరి
గోదావరి నది ఉరకలెత్తుతున్నది. కాళేశ్వరంలో నదీ ప్రవాహం సుమారు 8.2 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మేడిగడ్డ బరాజ్‌కు వరద భారీగా పెరుగుతున్నది. 7,09,850 క్యూ సెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాజేడు మండలంలోని పేరూరు వద్ద గోదావరి 15,370 మీట ర్లు (48) అడుగులకు చేరింది. పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద ఉరకలేస్తున్నది. కన్నాయిగూడె మండలంలో ని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 7,35,740 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు.
పశువుల కాపరులను కాపాడిన పోలీసులు
కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి అడవిలో పశువులను మేపేందుకు వెళ్లిన ఏడుగురిని గురువారం రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు రక్షించారు. రోజంతా భారీ వర్షం కురవడంతో సర్వాయి వాగు ఉధృతి పెరగడంతో బు ట్టాయిగూడెం గ్రామానికి చెందిన సంజీవ, నరేశ్, మల్కపల్లి గొత్తికోయగూడేనికి చెందిన దేవ, మ నోజ్, దివ్య, లక్ష్మి, అడుమమ్మ అడవిలోనే చిక్కుకుపోయారు. పోలీసులకు సమాచారం అందడం తో ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించగా వారిని స్పీడ్ బోట్ ద్వారా సురక్షితంగా కాపాడారు.