ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఆ ఊసే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ‘చేయి’చ్చింది. 2024లో హడావిడిగా ప్రక టించిన క్యాలెండ ర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయక ఎస్సీ రిజర్వేషన్ సాకుతో దాన్ని మూలన పడేసింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తమ ఖాతాలో వేసుకొని మభ్యపెట్టిం ది. నిరుద్యోగులను డైవర్షన్ చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకం పెట్టి అదీ ఇవ్వకుండా మోసం చేసింది. కాంగ్రెస్ సర్కారుపై తాడో పేడో తేల్చుకునేందుకు యువత ఈ నెల 20న ఇంది రా పార్కు వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నది.
– హనుమకొండ చౌరస్తా, జూన్ 17
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంత్రులు, కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజానికి గ్రూప్-1, 2, 3, 4 పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు పడ్డాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, విద్యుత్ సంస్థలు, గురుకులాల్లో కూడా అప్పటివే.. వాటిల్లో కొన్నింటికి రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఎగ్జామ్స్ నిర్వహించగా, మరికొన్నింటికి రిజల్ట్స్ వెల్లడించి నియామక పత్రాలు ఇచ్చారు. కేవలం గ్రూప్-1, టీచర్ల ఉద్యోగాల్లో కొన్ని పోస్టుల సంఖ్య పెంచడం, చిన్నచిన్న ఉద్యో గాలు తప్ప కాంగ్రెస్ సర్కారు ఒరగబెట్టిందేమీ లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
స్థానిక ఎన్నికలు వస్తే ఈ ఏడాది లేనట్లే..
2024 అక్టోబర్ నుంచి జాబ్ క్యాలెండర్ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దాన్ని వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడితే ఇక ఈ ఏడాది కూడా ఉద్యోగాల భర్తీ లేనట్లే. యేటా జూన్ 2న అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చి మరిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారును నిలదీ సేందుకు నిరుద్యోగులు జేఏసీలను ఏర్పాటు చేసుకుని ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
రాజీవ్ యువ వికాసంతో డైవర్షన్
ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులను డైవర్షన్ చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. రుణాలను మంజూరు చేస్తున్నాం కదా.. ఇంక సరారీ కొలువులు ఎందుకు అనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోందని యువత అనుమానం వ్యక్తం చేస్తున్నది. పోనీ రుణాలు ఇచ్చారా అంటే అదీ ఇవ్వకుండా మోసం చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. ప్రభు త్వం నిరుద్యోగుల పట్ల అలసత్వం వహించడం, ఓపికను పరీక్షించడం మంచిది కాదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసి సర్కారు చిత్తశుద్ధని నిరూపించుకోవాలి.
– జీ రాజేశ్, నిరుద్యోగి
గ్రూప్స్ నోటిఫికేషన్ ప్రకటించాలి
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభు త్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకోవడం కాదు , త్వరగా గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకుంటే మరో భారీ ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
– సందీప్ కుమార్, గ్రూప్స్ అభ్యర్థి