జయశంకర్భూపాలపల్లి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : గణపసముద్రం చెరువులో నీళ్లు న్నా.. కాల్వలకు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తండ్లాడుతున్నారు. జూన్ చివరి వారంలో అధికారులు నీటిని వదలడంతో పాటు కురిసి కొద్దిపాటి వర్షానికి కొందరు నాట్లు వేసు కోగా, మరికొంతమంది వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరవై రోజుల నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సొంత మండలం గణపురంలోని అన్నదాతలు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కోట, మత్తడి కాల్వల ద్వారా వెంట నే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని సర్కారును కోరుతున్నారు.
గణపసముద్రం పరిధిలోని సోలీపేట కాల్వ కింద 111, కొత్త కాల్వ 995, మత్తడి కాల్వ 553, ఊట కాల్వ 789, కోట కాల్వ 300, పైడి కాల్వ 404 ఎకరాలు మొత్తం 3,152 ఎకరాలు, అనధికారికంగా మరో 2,500 ఎకరాల్లో మొత్తం ఆరు వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. కానీ నార్లు పోసిన తర్వాత ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు సాగునీరందించలేమని మొండికేస్తు న్నారని, తమ పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రామప్ప సరస్సులో తగినంత నీరున్నప్పటికీ అధికారులు గణపసముద్రం చెరువులోకి నీళ్లను వదలడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. తాము ఈ చెరువుపైనే ఆధారపడి బతుకున్నామని, నీటిని విడుదల చేయకపోతే పంటలు ఎండిపోతాయని, తద్వారా అప్పుల పాలవుతామని వాపోతున్నారు. ప్రభుత్వం మరో మూడు నెలల పాటు నిరంతరంగా సాగునీరందించి వరి పంటలను కాపాడాలని కోరుతున్నారు.
రామప్ప సరస్సు నుంచి దేవాదుల పంపుల ద్వారా 150 కి.మీ దూరాన ఉన్న జనగామ, స్టేషన్ఘనపూర్కు 3-4 రోజులు నీటిని ఆపేసి 3 కి.మీ దూరంలో ఉన్న గణపురం రైతులకు నీళ్లివ్వాలి. అధికారుల మాటలు నమ్మి నార్లు పోసి, నాటు వేసుకున్నాం. ఇప్పుడు ఇబ్బంది పెట్టడం సరైంది కాదు.
– సిరిగనేని బాబురావు, రైతు, గణపురం
గణపసముద్రంలో 17 ఫీట్లు మాత్రమే నీళ్లున్నాయి. కాబట్టి రైతులకు సాగునీరు అందించ లేకపోతున్నాం. కేవలం తాగునీటికే వాడుతున్నాం. రామప్ప సరస్సు నుంచి వంగపెల్లి చెరువులో కి ప్రతి రోజూ 20 నుంచి 30 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ఆ నీటితో పాటు మరిన్ని వర్షాలు పడి గణపసముద్రం నిండగానే సాగునీరందిస్తాం.
-రాములు, నీటిపారుదలశాఖ ఈఈ, భూపాలపల్లి