పాలకుర్తి, మార్చి 1 : పాలకుర్తి నియోజకవర్గంలో వరి పొలాలు రైతుల కళ్ల ముందే ఎండిపోతుండడం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తట్టుకొలేకపోయారు. పొలాలు బీటలుగా వారుతుంటే చలించిపోయారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులు, ప్రజల పక్షమేనని మరోసారి నిరూపించారు. భూగర్భ జలాలు లేక పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో ఎండిపోతున్న వరి పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
వెంటనే సాగునీరు విడుదల చేయాలని దేవాదుల సీఈ, ఎస్ఈ, ఈఈలతో పాటు ఇతర అధికారులతో ఫోన్లో పలుమార్లు మాట్లాడారు. శాతాపురంతో పాటు దేవరుప్పుల మండలంలోని పలు తండాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పర్యటించిన ఆయన.. వెంటనే నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈమేరకు అధికారులు శనివారం దేవాదుల-4ఎల్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. రైతుల బాధలను చూసి గోదావరి జలాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదుల నీటి పారుదల శాఖ అధికారులకు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.