హనుమకొండ సబర్బన్, మార్చి 1 : దేవాదుల ఉత్తర కాల్వ పరిధిలోని పిల్ల కాల్వల ఆక్రమణను సహించేది లేదని నీటిపారుదల (దేవాదుల) శాఖ ఏఈ అరవింద్ తెలిపారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘దేవా.. దిక్కెవరు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. కాల్వలు అన్యాక్రాంతమైనట్లు ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని, అన్నింటిని త్వరలోనే పరిశీలించి వాటి ఆక్రమణలకు పాల్పడిన గ్రానైట్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
దీని కోసం శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తామన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటరీ 7కు గేట్ బిగించే విషయంలో రైతులను సిబ్బంది డబ్బులు అడిగిన విషయం కూడా తమ దృష్టికి రాలేదని, విచారణలో నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సరఫరా విషయంలో సమస్యలుంటే రైతులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చివరి ఆయకట్టు వరకు నీటిని అందించక పోవడం నిజమేనని, దీనికి మొదట ఉన్న రైతులు అనుమతులు లేకుండా కాల్వల్లో మోటర్లు బిగించి పంటలకు నీరు తరలించడమే కారణమని అరవింద్ స్పష్టం చేశారు.