కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు కేంద్రంగా మారింది. పైరవీకారుల పెత్తనం నడుస్తున్నది. కీలక మైన విభాగాల్లో నిబంధనలు పాటించకపోవడంతో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసక బారుతున్నది. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల వాల్యూయేషన్‌లో డెయిలీ వేజ్ సిబ్బంది పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతా ధికారులు సొంత ప్రయోజనాలే ధ్యేయంగా అర్హత లేని వారికి పేపర్లు దిద్దే అవకాశం ఇస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. సబ్జెక్టుపై అవగాహన లేని వారి వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా డబ్బుల వ్యవహారంతోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– వరంగల్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల వాల్యూయేషన్‌లో అక్రమార్కులు జరిగాయని ఉద్యోగులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లెక్చరర్‌గా అర్హత లేకున్నా యూనివర్సిటీలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు, రోజు వారీ పారితోషికంపై పనిచేసే వారికి పేపర్లు దిద్దే అవకాశం కల్పిస్తున్నారు. పేపర్లు వాల్యూయేషన్ చేసే అర్హత ఉండాలంటే.. ఏదైనా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండాలి. బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్)తో నియామకమై ఉండాలి. కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి కార్యాలయంలో జరిగే వాల్యూయేషన్ పద్ధతి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది.
కేయూ దూర విద్య కేంద్రం(ఎస్డీఎల్సీఈ)లో రోజువారీ పారితోషికం ప్రాతిపదికన పనిచేస్తున్న ఎ.సుదయ్యకు పీహెచ్డీ పూర్తి చేశాడనే కారణంతో డిగ్రీ పరీక్ష పేపర్లు దిద్దే అర్హత కల్పించేలా ఎగ్జామినర్‌గా నియమిస్తూ రహస్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు ఎలాంటి అర్హతలు లేకున్నా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా ఆర్డర్ కాపీ సిద్ధం చేసి పరీక్ష పేపర్లు దిద్దేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి.
సుదయ్యను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అని పేర్కొంటూ ఎగ్జామినర్‌గా పేపర్ వాల్యూయేషన్‌కు అనుమతి ఇచ్చారు. ఎగ్జామినేషన్‌లో బ్రాంచ్‌లో ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు పేపర్ వాల్యూయేషన్‌లో పాల్గొన్నాడు. ఏ కాలేజీలోనూ లెక్చరర్‌గా విధులు నిర్వర్తించని వ్యక్తికి సబ్జెక్టుపై ఎలా అవగాహన ఉంటుందని, ఇలాంటి వారి వల్ల తమ భవిష్యత్తు నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. అర్హతలేని వ్యక్తితో పేపర్లు వాల్యూయేషన్ చేయించడంతో బాగా చదివిన వారు ఫెయిల్ అవుతున్నారని, నామమాత్రంగా రాసే వారికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని అంటున్నారు.
కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారుల తప్పిదంతో విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేస్తున్నారు. గతంలో కాకతీయ యూనివర్సిటీలో ఒక విద్యార్థికి ఓ సబ్జెక్టులో 100 మార్కులకు 105 వేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరో పేపరులో 40 మార్కులకు 43 వేశారు.
గతేడాది డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థులను మెమో ఆబ్సెంట్ అయినట్లుగా పేర్కొంటూ ఫెయిల్ అని నమోదు చేశారు. అర్హతలేని వారికి కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడం వల్ల ఇలా జరుగుతున్నదని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీలో కీలక మైన విభాగాల్లో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయని… ఉన్నతాధికారులు సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
ఎస్డీఎల్సీఈలో సుదయ్య డెయిలీవేజ్ ఉద్యోగి. ఆయన లెక్చరర్ కాదు. బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఎక్కడో పొరపాటు జరిగింది. జనవరిలో జరిగిన డిగ్రీ సెమిస్టర్ వాల్యూయేషన్‌కు నేను కంట్రోలర్ నుంచి రిజిస్ట్రార్‌గా వచ్చాను. కంట్రోలర్‌గా డాక్టర్ ఎస్. నర్సింహాచారి వచ్చారు. కంప్యూటర్ బేస్డ్ సంతకం కావడంతో అతను ఆర్డర్ కాపీని చూసుకోలేదు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటాం.