హనుమకొండ, నవంబర్ 1 : నిబద్ధత, కమిట్మెంట్ ఉన్న రాకేశ్రెడ్డిలాంటి వ్యక్తులు అంటే తానే పార్టీలతో సంబంధం లేకుండా ఇష్టపడుతానని, రాకేశ్రెడ్డిలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్లు పార్టీలకు అవసరమని ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీకి రాకేశ్రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసి ఆయన బుధవారం రాత్రి హనుమకొండ ఎన్జీవో కాలనీలోని రాకేశ్రెడ్డి పార్టీ కార్యాలయంలో కలిసి సంఘీభావం తెలిపారు.
బీఆర్ఎస్లోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తనకు చాలా కాలంగా రాకేశ్రెడ్డి పరిచయం ఉన్న వ్యక్తి అన్నారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరి ముఖ్య భూమిక పోషించి పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తుచేశారు. తనను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. అనంతరం రాకేశ్రెడ్డి మాట్లాడుతూ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి తనవద్దకు వచ్చి మాట్లాడడం గొప్పవిషయమని, బీఆర్ఎస్లో చేరడంపై తమ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.