జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని పలిమెల గ్రామంపై దక్కన్ సిమెంట్స్ పడగ కమ్ముకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 200 ఎకరాల భూమిని 60 ఏళ్లుగా కాస్తులో ఉన్న రైతుల నుంచి లాక్కునేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే 102 ఎకరాలు దక్కన్ సిమెంట్స్ పేరిట రిజిస్ట్రేషన్ కాగా, మరో 100 ఎకరాలు స్లాట్ బుకింగ్‌లో ఉంది. వీటి రిజిస్ట్రేషన్లను ప్రస్తుతం ప్రభుత్వం నిలిపివేసింది. ఈ తతంగమంతా కాస్తులో ఉన్న రైతులకు తెలియకుండానే కొనసాగింది. గతంలోనే ధరణిలో పేర్లు నమోదు చేయించుకున్న అక్రమార్కులు ప్రస్తుతం ఆ భూములను దక్కన్కు ధారాదత్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పోరాట ఫలితంగా 200 ఎకరాలు అక్రమార్కుల చెర నుంచి విముక్తి పొందినట్లయింది. ఈ బాగోతమంతా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కనుసన్నల్లో నడుస్తున్నదనే ఆరోపణల నేపథ్యంలో ఆయన రైతులకు న్యాయం చేస్తారా? అక్రమార్కులను అందలం ఎక్కించి దక్కన్ సిమెంట్స్‌కు భూములు కట్టబెడతాడా? అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతున్నది. కాగా, ఇంత జరుగుతున్నా మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. రైతులంతా 60 ఏళ్లుగా ఈ భూముల్లో కాస్తులో ఉండడం తప్ప వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఆ భూములను వదులుకుంటే పైసా చేతికి వచ్చే పరిస్థితి లేదు. బతుకు దెరువుకు వేరే దారి లేక పొట్ట చేతపట్టుకుని ఊరు విడిచి వెళ్లాల్సిందేనా? లేదా లగచర్ల లాగా రైతులు మరో పోరాటం చేయాల్సిందేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తహసీల్దార్ పాత్రపై విచారణ
పలిమెలలో భూముల రిజిస్ర్టేషన్‌పై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ ఈ ఉదంతంపై విచారణ జరిపారు. ఇక్కడి రైతులు కాస్తులో ఉన్న భూములను 2008లో మంథని, ధన్వాడ, లద్నాపూర్ తదితర గ్రామాల నేతలు రిజిస్ర్టేషన్ చేయించుకొని ఇప్పుడు గుట్టు చప్పుడు కా కుండా దక్కన్కు కట్టబెట్టారు. అసలు దక్కన్ సంస్థ ఇక్కడికి ఎలా వచ్చింది? దీని వెనుక అసలు సూత్రధారులెవరు? భూముల రిజిస్ర్టేషన్ చేయిస్తున్నది ఎవరు? తహసీల్దార్ తన కార్యాలయంలో కాకుండా వేరే చోట రిజిస్ర్టేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? తెర వెనుక ఎవరున్నారు? అనేది బహిరంగ రహస్యంగా ఉంది. ఈ విషయమై సబ్ కలెక్టర్ రైతుల నుంచి వివరాలు సేకరించి తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలను కలెక్టర్‌కు విన్నవించగా, అతడిపై చర్యల బాధ్యతలను సీసీఎల్ఏకు అప్పగించారు.
ప్రాణాలు పోయినా భూములు వదలం
ఇక్కడ మా తాత, తండ్రుల నాటి నుంచి భూమిని కాస్తు చేసుకుని బతుకుతున్నం. మా వద్ద అప్పుడు ఇచ్చిన తోక పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. మా భూములు లాక్కోవద్దు అని చాలా సార్లు మంత్రి శ్రీధర్‌బాబును కలిశాం. అయినా స్పందించకపోగా మాపై కేసులు పెట్టించిండు. మా భూములు దక్కన్ కంపెనీకి ఎలా రిజిస్ర్టేషన్ చేస్తారు? మంత్రికి తెల్వకుండా వందల ఎకరాలు కంపెనీ పేరుతో ఎలా రిజిస్ర్టేషన్ అయితది? మా ప్రాణాలు పోయినా భూమిని వదులుకోం. మాకు ఈ భూమే దిక్కు. అక్రమ రిజిస్ర్టేషన్ రద్దు చేయాలి. పదేళ్లు కాస్తులో ఉంటే దళిత, గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని చట్టంలోనే ఉంది. మరి 60 ఏళ్లుగా ఈ భూమలనే నమ్ముకుని బతుకుతున్నం. మాకు ఈ చట్టం వర్తించదా?
– పెద్ది పోచయ్య, రైతు, బోడాయిగూడెం