వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 3: దివ్యాంగులను గౌరవంగా చూసుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్నారై ఆడిటోరియంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రతి ఒక్కరూ దివ్యాంగులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారిపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు.
దివ్యాంగుల్లో మనోధైర్యం ఎక్కువగా ఉంటుందని, అదే వారిని అనుకున్న లక్ష్యం చేరుకునేలా చేస్తుందన్నారు. జివాంజీ దీప్తి స్ఫూర్తితో చాలామంది పిల్లలు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారని గుర్తుచేశారు. వారిని అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల కోసం వచ్చే దివ్యాంగులకు ప్రత్యేక ఓపీ ఉంటుందన్నారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, డీఆర్వో విజయలక్ష్మి, డీఆర్డీవో కౌసల్యాదేవి, డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఎంజీఎం ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్‌కుమార్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగుల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాటరీ సైకిళ్ల పంపిణీ
రాయపర్తి/నెక్కొండ/దుగ్గొండి/నల్లబెల్లి/కాశీబుగ్గ: రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురు దివ్యాంగులకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి బ్యాటరీ సైకిళ్లను అందజేశారు. దివ్యాంగుల్లో మనోధైర్యం నింపడానికి సైకిళ్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సురేంద్రనాథ్ రాథోడ్, సాయికిరణ్, అనిల్ పాల్గొన్నారు. నెక్కొండలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షురాలు పొన్నాల విజయ, ప్రధాన కార్యదర్శి కొత్వాల రమాదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. వైకల్యం శరీరానికి మాత్రమే కానీ మనసుకు కాదన్నారు. ఆత్మైస్థెర్యంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో సీఏలు మహేందర్‌రెడ్డి, వెంకటేశ్, అనంతుల వీరేశ్, శ్వేత పాల్గొన్నారు.
దుగ్గొండిలోని హైస్కూల్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. పట్టుదల ఉంటే అసాధ్యమంటూ ఏదీ లేదన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ఎ.రామస్వామి, శ్రీనివాస్, రవి, గీత, భాస్కర్, అరుణ, కృష్ణ పాల్గొన్నారు. నల్లబెల్లిలో దివ్యాంగుల ఫోరం మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు. బీహెచ్పీఎస్ సంఘం మండల అధ్యక్షుడు పులి రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్ అందించాలని కోరారు. కాసర్ల సాంబరెడ్డి, అనుముల మల్లారెడ్డి, సాంబయ్య, విజయ్, అరుణ పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కాశీబుగ్గలోని మదర్ థెరిస్సా చారిట్రబుల్ ట్రస్ట్‌లో దివ్యాంగులు, వయో వృద్ధులతో వరంగల్ జిలా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారిలో మనోధైర్యం కల్పించారు. దివ్యాంగులకు సేవలు అందిస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రెండు నెలల్లో దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.