మహబూబాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లు ఒకే చోట అమ్మకం జరిపేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. 18 నెలల క్రితం దీనిని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు అందులోకి చిరు వ్యాపారులను రప్పించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు రూ. 7 కోట్లతో వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లకు సంబంధించి మూడు మారెట్ల సముదాయాలను కార్పొరేట్ స్థాయిలో ఒకేచోట నిర్మించింది. దీనిని 2023 జూన్ 30న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ సందర్భంగా మార్కెట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను చిరు వ్యాపారులకు కేటాయించాలని కేటీఆర్ ఆదేశించారు. అయితే మున్సిపల్ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు కొత్త మారెట్లలోకి చిరు వ్యాపారులను అనుమతించడం లేదు. వారు గాంధీ పార్కులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలోనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన మూడు రకాల మారెట్లను ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఎందుకు కేటాయించడం లేదో తెలియడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల జరిగిన మండలి సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని తకళ్లపల్లి సభ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్యను పరిషరించాలని, స్టాళ్లను చిరు వ్యాపారులకు కేటాయించాలని కోరారు.
అయినప్పటికీ ఇప్పటివరకు స్టాళ్లను చిరు వ్యాపారులకు కేటాయించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. చిరు వ్యాపారులు సైతం మున్సిపల్ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే మారెట్లను నిర్మించినా తమకు ఎందుకు అప్పగించడం లేదని ఆందోళన చెందుతున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే తొర్రూరులో ఇదే నమూనాలో నిర్మించిన మారెట్లను ప్రారంభించగా అందులో చిరు వ్యాపారులు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను చిరు వ్యాపారులకు కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించారు. అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించినప్పటికీ ఇందులోని స్టాళ్లను చిరు వ్యాపారులకు కేటాయించడంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా స్టాళ్లను చిరు వ్యాపారులకు కేటాయించాలి. లేదంటే వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
-ఎడ్ల వేణు, కౌన్సిలర్, మహబూబాబాద్