కాజీపేట, అక్టోబర్ 14 : కాజీపేట రైల్వే జంక్షన్ ఇక సోలార్ స్టేషన్‌గా మారనున్నది. రైల్వే ప్లాట్‌ఫామ్ పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. గతంలోనే అమృత్ పథకానికి ఎంపికైన కాజీపేట రైల్వే జంక్షన్లో రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫామ్స్, స్టాల్స్, కార్యాలయాల్లో విద్యుత్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2, 3 నంబర్ ప్లాట్‌ఫామ్ పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ మధ్యలోని షెడ్డు కప్పుపై దాదాపు 50 మీటర్ల పొడవు, 8 ఫీట్ల వెడల్పు ఉన్న 182 సోలార్ ప్యానళ్లను సిబ్బంది బిగిస్తున్నారు. ఈ సందర్భంగా రైల్వే ఇంజినీర్ మాట్లాడుతూ.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానళ్లు సూర్యకాంతిని గ్రహించి ప్రతిరోజూ వెయ్యి యూనిట్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయన్నారు. ప్లాట్‌ఫామ్ పైనున్న కార్యాలయంలో సోలార్ విద్యుత్ ఇన్వర్టర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే జనగామ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.