హనుమకొండ/జనగామ చౌరస్తా/ములుగు రూరల్ : తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలన్న డిమాండ్‌తో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హనుమకొండలో శివుడు, పోతరాజు, రుద్రమదేవి, గణపతి, భరతమాత, సమ్మక్క, సారలమ్మ తదితర వేషధారణతో ఉద్యోగులు కీర్తి స్తూపం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదాలత్ జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం, నక్కలగుట్టలోని ప్రజాకవి కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. తమను క్రమబద్దీకరించే వరకు సమ్మె విరమించేది లేదని ప్రతినపూనారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు ఎండీ షఫీ, దొనికల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జనగామలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రుల మాస్కులు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు తాడూరి రమేశ్, ప్రధాన కార్యదర్శి బైరగోని దయాకర్ గౌడ్, కోశాధికారి గోలి రవీందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె ప్రదేశం నుంచి జాతీయ రహదారి వరకు శాంతియుత మహా ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి కుమార్పాడ్యా, మహిళా అధ్యక్షురాలు జీవనప్రియ తదితరులు పాల్గొన్నారు.