జనగామ, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సోషల్ మీడి యా వేదికగా అభ్యర్థులు వారి మద్దతుదారులు సాధారణ ఎన్నికలకు దీటుగా హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన పోటీదారులైతే ఏకంగా పెద్దపెద్ద ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లతో విస్తృత ప్రచారం చేస్తుండడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. వార్డులు, కులాలు, యువత, మహిళలు, వికలాంగులు, పెన్షన్‌దారులు, రిటైర్డు ఉద్యోగుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ అకౌంట్లు ప్రారంభించి అన్నివర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
సర్పంచు, వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓట్ల కోసం ఓటర్లకు ఆడియో, వీడియో రికార్డుల ద్వారా వేడుకోలు, విజ్ఞప్తులు సహా ప్రత్యర్థులపై పోస్టులు, కామెంట్లు పెడుతూ.. తనను గెలిపిస్తే గ్రామానికి చేసే పనులను హామీల రూపంలో వాట్సాప్ గ్రూపు ల్లో పెడుతున్నారు. తమకు అనుకూలంగా కరపత్రాలు, పోస్టర్లు ముద్రించుకోవడం, గ్రామీణుల ను ఆకర్షించేలా పాటలు పాడించుకొని వాటిని సోషల్ మీడియా ద్వారా నేరుగా ఓటర్లకు చేర్చు తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీల వారీగా గ్రూపులు క్రియేట్ చేసి తమ పార్టీ గ్రామాలకు చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, తనను గెలిపిస్తే జరగబోయే అభివృ ద్ధిని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఆశించి భంగ పడి రెబల్‌గా రంగంలోకి దిగిన అభ్యర్థులు పార్టీలు, నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండగా వారి మద్దతుదారులు ఖండన పోస్టులు పెడుతుండడం వాట్సాప్ వార్ పల్లెల్లో రాజకీయ హీట్‌ను పెంచుతున్నది. ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులు తమకు పెన్షన్ బెనిఫిట్స్ రావడంలేదని పెడుతుంటే.. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రావడం లేదని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ప్రస్తావించి అమలు చేయాలని కోరుతుండడం పల్లె పోరు కాస్తా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తీరును తలపిస్తున్నది. ఓటును నోటుకు అమ్ముకొని గ్రామాభివృద్ధిని ఫణంగా పెట్టకు.. నిజాయితీపరులకు పట్టం కట్టండి.. అంటూ యువత, విద్యార్థులు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.