ఖానాపురం, డిసెంబర్ 23 : వినూత్నంగా ఆలోచించడం ద్వారానే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. అశోక్‌నగర్ సైనిక్స్కూల్లో మూడు రోజులుగా జరుగుతున్న స్టేట్ ఇగ్నైట్ ఫెస్ట్ ఎత్నోవా 2022 శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పీవో అంకిత్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఎగ్జిబిట్లు, యూత్ పార్లమెంట్ నిర్వహణ ఎంతో అద్భుతంగా ఉందన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు, వినూత్నంగా ఆలోచించడం నేర్చుకోవాలన్నారు. క్రీడలు, సీసీఈ విధానంలో విద్యను నేర్చుకోవడం, చర్చలు, డిబేట్ వల్ల విద్యార్థుల్లోని ప్రతిభ బయటికి వస్తుందన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి కలుగుతుందన్నారు. దేశాభివృద్ధి కోసం విద్యార్థులు టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నారు. ఇగ్నైట్ ఫెస్ట్‌ను చక్కగా నిర్వహించిన సైనిక్ స్కూల్ బాధ్యులను పీవో అభినందించారు. ముందుగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. ఇగ్నైట్ ఫెస్ట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా రంగారెడ్డి జిల్లా నిలువగా రెండో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచింది. గెలుపొందిన విద్యార్థులకు పీవో అంకిత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్సీవో వెంకన్న, సైనిక్‌స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, సర్పంచ్‌లు కవిత, అయిలయ్య, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.