బీఆర్ఎస్లో నూతనోత్సాహం నెలకొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతుండడంతో ఫుల్ జోష్ కనబడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు మద్దతుగా తాము కారు ఎక్కుతున్నట్లు ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, వార్డుసభ్యులు, పీఏసీఎస్ అధ్యక్షులు, డైరెక్టర్లు తదితరులు స్పష్టం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని పండుగ వాతావరణంలో స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతిస్తూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత చేరికలు పెరగడంతో గులాబీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. – వరంగల్, ఆగస్టు 31(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ రాజకీయ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు మద్దతుగా తాము కారు ఎక్కుతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఆయా శాసనసభ నియోజకవర్గంలో వారిని స్థానిక ఎమ్మెల్యే స్వాగతిస్తున్నారు. గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులు తమ అనుచరులతో కలిసి గులాబీ దండులో చేరారు. వీరిలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, పీఏసీఎస్ అధ్యక్షులు, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ బీజేపీకి గుడ్‌బై చెప్పి తన అనుచరులతో కలిసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా కమలదళం వీడి కారెక్కారు. గీసుగొండ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు, మనుగొండ ఎంపీటీసీ సభ్యురాలు ఎంపీపీ రడం శ్రావ్య కాంగ్రెస్ పార్టీని వదిలి తమ అనుచరగణంతో కలిసి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే మండలంలోని రాంపురం గ్రామ సర్పంచ్ గాజర్ల గోపి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. ఈయనను ఎమ్మెల్యే ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరడం కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు మరింత పెరిగాయి.
తాజాగా ఊరూరా చేరికల పండుగ వాతావరణంలో జరుగుతున్నది. ఆయా నియోజకవర్గంలో ప్రతిరోజూ కొన్ని గ్రామాల నుంచి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గులాబీ కండువా కప్పుకుని జై బీఆర్ఎస్, జైజై కేసీఆర్ అంటున్నారు. బుధవారం రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని బీఆర్ఎస్లోకి స్వాగతించారు. ఇదే మండలంలోని పెరికేడు గ్రామంలో బీఆర్ఎస్యేతర పార్టీల నుంచి పలువురు గులాబీ దళంలో చేరారు. వారిని మంత్రి ఎర్రబెల్లి బీఆర్ఎస్లోకి స్వాగతించారు. బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటు పడాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు.

నర్సంపేటలో ఉత్సాహంగా చేరికలు
నర్సంపేట నియోజకవర్గంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం చెన్నారావుపేట మండలం బోడమాణిక్యంతండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఇదేరోజు నర్సంపేట మండలం బాంజీపేట గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన 30, మాదన్నపేట గ్రామంలో 15 కుటుంబాల కార్యకర్తలు ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు రోజు మంగళవారం చెన్నారావుపేట మండలం బోజెరువు గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్లో చేరారు. గత సోమవారం నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి 200 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమ వుతుందనే నమ్మకంతో తాము బీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు.
26న ఇదే మండలం నాగుర్లపల్లి గ్రామంలోని కాంగ్రెస్‌కు చెందిన 30, నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామంలోని కాంగ్రెస్ నుంచి 40 కుటుంబాల సభ్యులు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. 25న నెక్కొండ మండలం ముదిగొండ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచి జక్కుల స్వరూపా అశోక్, వార్డు సభ్యులతో పాటు పలువురు కార్యకర్తలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 24న నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి 40 కుటుంబాల సభ్యులు ఆ పార్టీలను వీడి కారెక్కారు. కొద్దిరోజుల క్రితం చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెం, అమీనాబాద్, అడ్డబాటతండా, గొల్లబామతండా, పాతముగ్దుంపురం, లింగగిరి, లింగాపురం, పాపయ్యపేట, చెన్నారావుపేట, నర్సంపేట మండలం ముత్తోజిపేట, రాజుపేట, కొండసముద్రంతండా, కమ్మపల్లి, నెక్కొండ మండలం చంద్రుగొండ, పనికర, సూరిపల్లి, ఖానాపురం మండలంలో బుదరావుపేట, ఖానాపురం, రాగంపేట తదితర గ్రామాల్లో బీఆర్ఎస్యేతర పార్టీల నుంచి అనేక మంది నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోచేరికల కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.
గీసుగొండ, సంగెంలో కాంగ్రెస్ ఖాళీ
పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుగొండ, సంగెం మండలాల్లో కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. ఆ పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు తమ కార్యకర్తలతో కలిసి హస్తం పార్టీకి స్వస్తి పలుకుతున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. గతంలో గీసుగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన రడం భరత్ ఇటీవల పలు గ్రామాలకు చెందిన తన అనుచరులతో కలిసి గులాబీ గూటికి చేరుకున్నారు. మనుగొండ, మచ్చాపూర్, ఊకల్, రాంపురం, చంద్రయ్యపల్లె తదితర గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు భరత్‌ను అనుసరించారు. కొద్ది రోజుల క్రితం ఈ మండలంలోని దస్రుతండా, కొమ్మాల, గొర్రెకుంట తదితర గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తాజాగా వంచనగిరి మాజీ సర్పంచి గుబల కవితా రమేశ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గురువారం బీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. గులాబీ కండు వా కప్పి ఎమ్మెల్యే చల్లా వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సంగెం మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోనూ ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతుండడంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొంది.