పాలకుర్తి, జూన్ 12 : పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇవ్వరా..?, గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిపొందిన వారికే మళ్లీ ఇస్తారా’ …, అంటూ పలువురు మహిళలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని నిలదీసి, నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో గత ప్రభుత్వంలో మంజూరైన రూ.10 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. అదే గ్రామానికి చెందిన గుండె మణెమ్మ అలియాస్ మారమ్మ, బండిపెల్లి సాలమ్మ, సోమనర్సమ్మలు ఎమ్మెల్యేను ఉద్దేశించి ‘అమ్మా మా గ్రామంలో అర్హులైన పేదలు ఉండగా ఒక్కరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు నాయకులకే వచ్చాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇండ్లు తీసుకున్న వారికే ఇప్పుడు మళ్లా ఇండ్లు మంజూరు చేశారు.. ఇదేక్కడి న్యాయం’ అంటూ ఎమ్మెల్యేను నిలదీసి, నిరసన తెలిపారు.
దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇతర పార్టీల వారికి ఇందిరమ్మ ఇండ్లు రావని చెప్పారు. వేరే పార్టీలకు ఓట్లు వేస్తే నిధులు రావన్నారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక ప్రసంగం మధ్యలోనే ముగించి, అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో ఎమ్యెల్యే తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సర్వే పేరుతో అధికారులు సైతం తప్పులు చేశారని గ్రామస్తులు మండిపడ్డారు.