నెల్లికుదురు/జఫర్‌గఢ్/బయ్యారం, అక్టోబర్ 17: కాంగ్రెస్‌లో ఇందిరమ్మ కమిటీలు చిచ్చురేపుతున్నాయి. సీనియర్లను విస్మరించారని నాయకులు కస్సుబుస్సులాడుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మురళీనాయక్‌ను సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పా టులో తమను విస్మరించడాన్ని నిరసిస్తూ నెల్లికుదురు మండల కేంద్రంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి, మాజీ జడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు, పార్టీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్‌గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. ఇండ్లలో కూర్చొని ఇందిరమ్మ కమిటీలు వేయడం దారుణమన్నారు. పార్టీకి ద్రోహం చేసే చర్యలకు పాల్పడితే అవసరమైతే ఢిల్లీకి వెళ్లయినా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీనియర్లను విస్మరించి, నిన్న, మొ న్న వచ్చిన వారికే చోటు కల్పించారని ఆరోపిస్తూ, ఆయన వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు జఫర్‌గఢ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం వినతి పత్రం ఇచ్చారు.
మాజీ జడ్పీటీసీ పట్టపూరి సదయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ శ్రేణులకు నామినేటెడ్ పోస్టులు, ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పిస్తూ అసలైన కాంగ్రెస్ వాదులను పక్కన పెడుతున్నాడని అన్నారు. కడియం తీరు మార్చుకోకపోతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ తాటికాయల శరత్‌బాబు, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి రడపాక రాజ్‌కుమార్, మండల సీనియర్ నాయకులు బానోత్ లచ్చి రాంనాయక్, బానోత్ భిక్షపతినాయక్,
ఓరుగంటి రాజు, కైరిక మల్లయ్య, జఫర్‌గఢ్ మాజీ ఉపసర్పంచ్ నంచర్ల లత, తిరుపతి, మర్రి రమేశ్, ఉల్లి శివరాజ్, కుక్కల ఎల్లయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్, రాజు, రాజేందర్, భాస్కర్, అఖిల్, బాబు, ఎల్లయ్య, నర్సయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బయ్యారం మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించిన ఇందిరమ్మ కమిటీలో మహిళా సభ్యుల పేర్లను తనకు సమాచారం లేకుండా ఎంపిక చేశారని కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు తగిర నిర్మలారెడ్డి ఆరోపించారు. ఆధిపత్యం కోసం ఆడబిడ్డలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. అందరి సమక్షంలోనే కమిటీ సభ్యుల పేర్లు నిర్ణయించాలని, లేకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.