పోచమ్మమైదాన్, అక్టోబర్ 20: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిరుపేదలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ 22వ డివిజన్ ఇన్చార్జి మావురపు గీతా విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్న వందలాది దళిత కుటుంబాలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరాయి. పోచమ్మమైదాన్‌లోని కెమిస్ట్రీ భవనంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. గత పాలకులు ఆజంజాహి మిల్లును అమ్ముకున్నారని, దేశాయిపేట తోళ్ల పరిశ్రమ అంతరించిపోతుంటే చోద్యం చూశారని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కొనియాడారు. పార్టీలో చేరిన దళితులందరికీ సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. దళితులందరికీ దళితబంధు, ఇళ్లు లేని వారికి దూపకుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలాలు ఉన్న వారికి గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 58, 59 జీవో ద్వారా పేదలకు పట్టాలు పంపిణీ చేశామని వివరించారు. వరంగల్‌లో 24 అంతస్తులతో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. కలెక్టరేట్ నిర్మాణ పనులు జరుగనున్నందున లేబర్‌కాలనీ సంపన్నుల కాలనీగా మారబోతున్నదని వెల్లడించారు. ఔటర్ రింగ్‌రోడ్డు పనులు జరుగుతున్నాయని, మెగా టెక్స్టైల్ పార్కులో నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పోచమ్మమైదాన్ పక్కనే త్రీస్టార్ హరిత హోటల్ నిర్మాణం జరుగుతున్నదని వివరించారు.
తాను పేదరికంలో పడిన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, రాజకీయ జీవితంపై ఓ పుస్తకం, వీడియో తీయిస్తున్నట్లు నన్నపునేని తెలిపారు. 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో పని చేసి, నేడు నరేందర్ గెలుపులో భాగస్వామ్యం అయ్యేందుకు డివిజన్‌కు చెందిన చుంచు రాజు, చుంచు మల్లేశం, చుంచు కృష్ణ, చుంచు నరేశ్, దామెర రవి, సాంబమూర్తి, గోపి, కొత్తపల్లి అరుణ్, గనిపాక పద్మతోపాటు 70 కుటుంబాల నుంచి 300 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, డివిజన్ ఇన్చార్జి మావురుపు విజయభాస్కర్‌రెడ్డిని నాయకులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అనిల్, మాజీ కార్పొరేటర్ భిక్షపతి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శివ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేందుకు ఆర్ఎంపీ, పీఎంపీలు ముందుకు రావడం నా అదృష్టమని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. శివవనగర్లోని సాయి కన్వెన్షన్ హాలులో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు తన కుటుంబ సభ్యులాంటివారన్నారు. నియోజకవర్గంలో ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు 300 గజాల స్థలం కేటాయించామన్నారు.