భీమదేవరపల్లి/ఐనవోలు, జనవరి 16 ; మకర సంక్రాంతిని పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరలకు భక్తజనం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి సోమ, మంగళవారాల్లో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో రెండు ఆలయాలు కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం బారులు తీరగా, కోరిన కోర్కెలు తీర్చాలని కోరమీసాలు సమర్పించుకున్నారు. కొత్తకొండలో డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ వేలేరు యాదవుల మేకలబండ్లు, తీరొక్క పూలు, రంగులతో ముస్తాబైన కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఐనవోలులో మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో మహానివేదనతో పెద్ద బండి శోభాయాత్ర పురవీధుల్లో వైభవంగా సాగింది. నెత్తిన బోనాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
కోరమీసాల స్వామికి కోటిదండాలు..
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మకర సంక్రాంతి పర్వదినాన వేకువజాము నుంచే లక్షలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించి తమ గండాలు తొలగిపోవాలని గండాదీపంలో నూనె పోశారు. అనంతరం కోడె ప్రదక్షిణలు చేశారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూకట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శీఘ్రదర్శనం, వీఐపీ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలోని దుకాణాలు, రంగులరాట్నం, సర్కస్ తదితర షాపులన్నీ రద్దీగా కనిపించాయి. సంక్రాంతి రోజున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, వొడితల సతీశ్ కుమార్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్ బాబు, వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్‌రావు ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ఉత్తరాయణ పుణ్యకాల పూజ నిర్వహించిన అనంతరం 108 లీటర్ల ఆవుపాలు, నవరసాలతో అభిషేకం, బిల్వదళార్చన మహాన్యాస పూర్వకంగా నిర్వహించారు. అనంతరం రుద్రయాగం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ, భక్తులకు విశేష దర్శనం జరిపించారు. యాగశాలలో జ్యోతిలింగార్చన పూజలు జరిగాయి. 365 దీపాలతో జ్యోతిలింగార్చన పూజలను వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి ఆనవాయితీ ప్రకారం వేలేరుకు చెందిన యాదవులు ఆలయం చుట్టూ డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ప్రదర్శించిన మేకలబండి ప్రదక్షిణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుట్టపైన కొలువుదీరిన వీరభద్రస్వామి ఆత్మలింగం ఆలయంలో దివ్యాలంకరణ పూజలు జరిగాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు ఇంటి నుంచి కొత్తకొండకు ఎడ్లబండి రథం వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ ఏడాది సైతం ఎడ్లబండి రథాన్ని అందంగా అలంకరించగా గ్రామస్తుల సమక్షంలో శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల నడుమ ఎడ్లబండి రథాన్ని కొత్తకొండకు గ్రామస్తులు సాగనంపారు. కార్యక్రమంలో పీవీ సోదరుని కుమారుడు పీవీ మదన్మోహన్రావు పాల్గొన్నారు. అలాగే ఈ ఏడాది సైతం సుమారు 58వరకు ఎడ్లబండ్లను బంతిపూలతో వివిధ రంగులతో అందంగా అలకంరించి రథాలుగా తీర్చిదిద్దారు. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వరకు సాగిన ఎడ్లబండి రథాలను తిలకించేందుకు ప్రజలు దారి వెంట బారులు తీరారు. హిందూ, ముస్లింలు ఎడ్లబండ్లతో వచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఆలయంలో ములుకనూరు ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు భక్తులకు సేవలందించారు. భక్తులకు ఆలయ ఈవో కిషన్‌రావు పూర్తి సదుపాయాలు కల్పించారు. జాతరలో భక్తుల సౌకర్యాలు, పారిశుధ్యంపై అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. వేకువజాము నుంచే పారిశుధ్య కార్మికులు నిరంతరాయం సేవలందించారు.
ప్రతి షాపు ఎదుట నిర్వాహకులు చెత్తబుట్టలు స్వతహాగా ఏర్పాటు చేసుకోగా ఎప్పటికప్పుడు కార్మికులు ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించారు. దుమ్ము లేవకుండా రోడ్లపై ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లించారు. 139మంది పారిశుధ్య కార్మికులు, 36మంది పంచాయతీ సెక్రటరీలు షిప్ట్వైజ్గా పనులు చేపట్టారు. ఎంపీడీవో భాస్కర్ సూచనలు చేయగా ఎంపీవోలు రవి, నాగరాజు మానిటరింగ్ చేశారు.భక్తుల సౌకర్యార్థం ములుకనూరు పీహెచ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో సిబ్బంది ఉండి మందులు పంపిణీ చేశారు. అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూదం, మట్కా, గుట్కా, గుడుంబా లేకుండా పూర్తిస్థాయిలో పోలీసులు నియంత్రించారు. అడుగడుగునా నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి అల్లరిమూకలకు చెక్ పెట్టారు.
రెండు టికెట్లపై 20మందికి దర్శనమా?
ఐనవోలులో మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి వీవీఐపీ టికెట్ తీసుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే వీవీఐపీలు దర్శనానికి ప్రత్యేక టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్లే పద్ధతిని ఈ జాతరలో కొత్తగా అమలులోకి తెచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎంపీలు ఇద్దరు టికెట్లు కొనుగోలు చేశారు కానీ వారి వెంట ఉత్సవ కమిటీ సభ్యులు కాకుండా సుమారు 20మందికి పైగా ఉన్నారు. వీవీఐపీ టికెట్ పేరుతో కొత్త పద్ధతిని అమలు చేసిన ప్రజాప్రతినిధులే ఈ పద్ధతిని సరిగా పాటించపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పక్ష నాయకులకు ఒక న్యాయం, ప్రతిపక్ష నాయకులకు మరో న్యాయమా అని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మమ్మేలు ఐలోని మల్లన్నా..
‘ఐలోని మల్లన్న దండాలో.. సల్లంగ సూడు దండాలో’ అంటూ భక్తులు చేసిన వేడుకోలుతో ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ ఆవరణంతా మార్మోగింది. సంక్రాంతి పర్వదినాన ఇక్కడ జరిగే జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనాలు, శివసత్తుల పూనకాలతో ఎల్లమ్మ దేవతకు, మల్లికార్జునస్వామికి నైవేద్యం సమర్పించారు. సంక్రాంతి పర్వదినం రోజున అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు మీసాలు, వెండి కిరీటం, వెండి కవచం సుగంధాలు వెదజల్లే గజ పుష్పమాలతో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు. అనంతరం మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్న మహానివేదన దేవుడి రథాన్ని మార్నేని వంశీయులు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఇంటి ముందు అందంగా ముస్తాబు చేయగా కొబ్బరి కొట్టి ఆయన ప్రారంభించారు. మహానివేదనతో బయల్దేరిన రథానికి వాడవాడలా మహిళలు మంగళహారతులు, కొబ్బరికాయలు కొడుతూ స్వాగతం పలుకగా ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించారు. ఏటా మార్నేని వంశీయులు మల్లికార్జునస్వామికి పెద్ద బండిని కట్టి కొత్తగా పండించిన ధాన్యం, బండారి, కుంకుమ, బెల్లంతో కూడిన ప్రసాదాన్ని మార్నేని వంశీయులందరి ఇండ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. అనంతరం ఒంటిమామిడిపల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాల నుంచి కూడా ప్రభబండ్లు కట్టి స్వామి వారికి మహానివేదనగా సమర్పించారు.